
తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు (83) ఈ తెల్లవారుజామున 4 గంటలకు కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణా జిల్లా కంకిపాడులో 1942 జూలై 10న జన్మించిన కోట శ్రీనివాసరావు, 1978లో 'ప్రాణం ఖరీదు' చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సుమారు 750కి పైగా చిత్రాల్లో నటించారు.
నేడు అంత్యక్రియలు
కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు హైదరాబాద్లోని మహా ప్రస్థానంలో నేడు మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్నాయి. ఆయన మనవడు శ్రీనివాస్ అంతక్రియలు పూర్తిచేయనున్నాడు. 2010 జూన్ 21న రోడ్డు ప్రమాదంలో కోటా కుమారుడు ప్రసాద్ మరణించిన విషయం తెలిసిందే. కోట కుమారుడికి ఇద్దరు అబ్బాయిలు.. శ్రీనివాస్ పెద్ద మనువడు కాగా హర్ష చిన్న మనువడు.
(ఇదీ చదవండి: అందరి గుండెల్లో 'కోట'.. తనదీ చార్మినార్‌కున్నంత హిస్టరీ 'తమ్మీ')
ఒక తండ్రిగా, ఒక తాతగా, ఒక విలన్‌గా, ఒక కమెడియన్‌గా, ఒక నిస్సహాయుడిగా, ఒక క్రూరుడిగా ఇలా ఆయన ఏ వేషం వేసినా.. దానికో ప్రత్యేక గుర్తింపు. విభిన్న రకాల పాత్రల్లో అవలీలగా ఒదిగిపోవడం ఆయనకే సాధ్యం. క్యారెక్టర్ నటుడిగా తనకంటూ ఒక స్థాయిని సెట్ చేసుకొని తెలుగు సినిమాకు పెట్టని కోటగా మారిన విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు. వెండితెరపై ఆయన పోషించని పాత్ర, పండించని రసం లేదంటే అతిశయోక్తి కాదేమో. సిల్వర్ స్క్రీన్‌ను విభిన్న పాత్రలతో సుసంపన్నం చేసిన కోటా శ్రీనివాస రావు తన సినీ ప్రయాణాన్ని ముగించారు.
తొలి ఛాన్స్ ఎలా వచ్చిందంటే..
‘ప్రాణం ఖరీదు’ (1978) సినిమాలో రావు గోపాలరావుగారు ప్రధాన పాత్రకు ఎంపిక అయ్యారు. అప్పటికే ‘ప్రాణం ఖరీదు’ నాటకం ప్రజల్లో ఆదరణ ఉంది. అందులో కోట నటించారు. ఆ నాటకాన్ని నిర్మాత వాసు, దర్శకుడు క్రాంతి కుమార్ చూసి సినిమా తీయాలనుకున్నారు. ఆ నాటిక రాసిన సీ.ఎస్.రావుగారే సినిమాకి కూడా రచయిత. ఆయనకు కోట అంటే చాలా సెంటిమెంట్ ఉండేది. దీంతో ‘ప్రాణం ఖరీదు’లో చిన్న వేషం ఉంది.. చేయాలని కోరారు. అలా కోట ప్రయాణం మొదలైంది.

అయితే, ఈ సినిమా తర్వాత ఆయన సుమారు ఐదేళ్లు గ్యాప్ తీసుకున్నారు. హైదాబాద్‌లోని స్టేట్‌బ్యాంకులో మంచి ఉద్యోగం ఉండటంతో కుటుంబాన్ని చూసుకుంటూ ఉండేవారు. జంధ్యాలగారితో ఉన్న పరిచయం వల్ల అమరజీవి (1983) చిత్రంలో నటించారు. అదే ఏడాదిలో విజయశాంతి ప్రతిఘటనలో ఛాన్స్ వచ్చింది. 1985లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ అయింది. ఆ రాత్రికి రాత్రి కోట స్టార్ అయిపోయారు. ఆయనకు వరుసగా భారీ ఆఫర్లు రావడంతో 1986లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిగా సినిమాలకే పరిమితం అయ్యారు.