
దర్శకురాలు ఫరా ఖాన్, హీరోయిన్ దీపికా పదుకోన్‌ల మధ్య అబీప్రాయభేదాలొచ్చాయని, అందుకే ఇన్‌స్టాలో వీరిద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారన్నది బాలీవుడ్ టాక్. దీపిక కెరీర్‌లోని రెండు బ్లాక్‌బస్టర్ చిత్రాలు ‘ఓం శాంతి ఓం’ (2007), ‘హ్యాపీ న్యూ ఇయర్’ (2014)లో షారుక్ ఖాన్ హీరోగా నటించగా, ఫరా ఖాన్ దర్శకత్వం వహించారు. ఇలా దీపిక–ఫరాల మధ్య మంచి అనుబంధం ఉంది.
అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూ సందర్భంగా సినిమాల్లో హీరోయిన్స్ 8 గంటలే పని చేయాలన్నట్లుగా, ‘ఎయిట్ అవర్స్ షిఫ్ట్’ కాన్సెప్ట్ గురించి దీపిక మాట్లాడారు. ఈ కాన్సెప్ట్‌పై భిన్నాబీప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇటీవల ఓ షోలో పాల్గొన్న ఫరా ఈ ‘ఎయిట్ అవర్స్ షిప్ట్’ గురించి కాస్త వ్యంగ్యంగా మాట్లాడారు. దీంతో దీపికను ఉద్దేశించే ఫరా ఖాన్ అలా మాట్లాడారని, అందుకే వీరిద్దరూ ఒకరినొకరు ఇన్‌స్టాలో అన్‌ఫాలో అయ్యారని ప్రచారమవుతోంది.
ఈ ప్రచారంపై ఫరా స్పందించారు. ‘‘హ్యాపీ న్యూ ఇయర్’ సినిమా షూటింగ్ సమయంలోనే నేను, దీపిక ఇన్‌స్టాలో కాకుండా డైరెక్ట్ మెసేజ్ లేదా ఫోన్ కాల్స్ ద్వారా మాట్లాడాలనుకున్నాం. అప్పుడే మేం ఒకరినొకరం అన్‌ఫాలో అయ్యాం. కొన్ని వెబ్‌పోర్టల్స్ కొత్త వివాదాలు సృష్టిస్తున్నారు’’ అంటూ తన ఇన్‌స్టా స్టోరీలో ఫరా షేర్ చేశారు. ఈ స్టోరీకి ఓ నమస్కారం ఎమోజీతో దీపిక స్పందించారు.