చిన్న బ్రేక్ తర్వాత షూటింగ్ షురూ చేశారు అల్లు అర్జున్. ఆయన హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకోన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, అనూ ఇమ్మాన్యూయేల్ నటించనున్నారనే ప్రచారం ఎప్పట్నుంచో జరుగుతున్న సంగతి తెలిసిందే.
కాగా, కొంత గ్యాప్ తర్వాత ఈ సినిమా కొత్త షెడ్యూల్ ముంబైలో ప్రారంభమైందని, అల్లు అర్జున్ ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారని బాలీవుడ్ సమాచారం. ఇటీవల ‘పుష్ప 2: ది రూల్’ సినిమా జపాన్‌లో విడుదల కాగా, ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అల్లు అర్జున్ జపాన్ వెళ్లారు. తిరిగి ఆయన ఇండియాకు వచ్చి అట్లీ డైరెక్షన్‌లోని సినిమా షూటింగ్‌తో బిజీ అయ్యారని టాక్.
అలాగే ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్స్ కాజోల్, జిమ్ సర్బ్ నటిస్తున్నారనే టాక్ కొత్తగా తెరపైకి వచ్చింది. అయితే ఈ అంశాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రం 2027లో విడుదల కానుందని తెలిసింది. ఇక అల్లు అర్జున్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాదే ప్రారంభం అవుతుంది.


