
టాలీవుడ్ కింగ్ నాగార్జున (Nagarjuna Akkineni) తాజాగా కూలీ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. రజినీకాంత్ హీరోగా వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది. తొలి రోజు రూ.151 కోట్లు రాబట్టిన కూలీ.. కోలీవుడ్‌లో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
అయితే తాజాగా ఓ టాక్ షోకు హాజరైన నాగార్జున పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నాన్న అక్కినేని నాగేశ్వరరావు చివరి రోజుల్లో అడిగిన కోరికను నెరవేర్చారు. మనం సినిమాలో తన పాత్రకు వేరొకరితో డబ్బింగ్ చెప్పించవద్దని అడిగారని నాగార్జున గుర్తు చేసుకున్నారు. అలా చేస్తే అస్సలు ఊరుకోను అన్నారని వెల్లడించారు. ఆయన కోరిక మేరకే బెడ్ మీద నుంచే డబ్బింగ్ మొత్తం పూర్తి చేశారని తెలిపారు. నా జీవితంలో ఎలాంటి ఒత్తిడి లేదని.. కానీ మనం సినిమా గురించి రాత్రిళ్లు నిద్రలేకుండా ఆలోచించేవాడినని నాగార్జున పేర్కొన్నారు. అప్పటికే ఆయనకు సినిమా చూపిస్తే.. చాలా బాగుందిరా అని అన్నారని నాగ్ పంచుకున్నారు.
నాగార్జున మాట్లాడుతూ..'మనం సినిమా మాకు చాలా స్పెషల్. ఫ్యామిలీ అంతా ఒకటే ఫ్రేమ్‌లో కనిపించాం. ఇది నాన్నగారి చివరి చిత్రమని మాకు షూటింగ్‌లోనే తెలిసిపోయింది. ఆయనకు క్యాన్సర్ రావడంతో అదే చివరి సినిమా అని మా అందరికీ తెలుసు. నాకు లైఫ్‌లో ఎలాంటి ఒత్తిడి లేదు.. కానీ రాత్రిళ్లు నిద్రపోకుండా ఆలోచించింది మాత్రం ఈ ఒక్క సినిమానే. డబ్బింగ్ వేరేవాళ్లతో చెప్పిస్తే ఊరుకోను.. నేనే చెప్తా అన్నారు. ఇంట్లో ఏర్పాటు చేసిన ఐసీయూ బెడ్ మీద నుంచే సినిమా డబ్బింగ్ మొత్తం పూర్తి చేశారు. ఆయన పాత్రకు తన సొంత వాయిస్‌తోనే డబ్బింగ్ చెప్పుకున్నారు. అప్పటికే నాన్నకు సినిమా చూపిస్తే చాలా బాగుందిరా అన్నారని' గుర్తు చేసుకున్నారు.