Ahimsa Movie Review And Rating In Telugu | Abhiram Daggubati | Geethika Tiwary | Sadha - Sakshi
Sakshi News home page

Ahimsa Movie Review In Telugu: ‘అహింస’ మూవీ రివ్యూ

Published Fri, Jun 2 2023 1:32 PM

Ahimsa Movie Review And Rating - Sakshi

టైటిల్‌: అహింస
నటీనటులు: అభిరామ్‌ దగ్గుబాటి, గీతికా తివారి, సదా,  కల్పలత, కమల్‌ కామరాజు, దేవి ప్రసాద్‌ తదితరులు
నిర్మాత : పి.కిరణ్‌
దర్శకత్వం : తేజ
సంగీతం: ఆర్పీ పట్నాయక్‌
సినిమాటోగ్రఫీ: సమీర్‌ రెడ్డి
ఎడిటర్‌ : కోటగిరి వెంకటేశ్వరరావు
విడుదల తేది : జూన్‌ 2, 2023

తెలుగు చిత్ర పరిశ్రమలో దగ్గుబాటి ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం ఉంది. రామా నాయుడు మొదలు రానా వరకు ఆ ఫ్యామిలీకి చెందిన ప్రతి ఒక్కరు తమదైన టాలెంట్‌తో ఇండస్ట్రీలో స్పెషల్‌ ఇమేజ్‌ని క్రియేట్‌ చేసుకున్నారు. అలాంటి ఫ్యామిలీ నుంచి ఓ మరో హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నారంటే.. ఆ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడడం సహజం. అందుకే ‘అహింస’పై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి.  సురేశ్‌ బాబు తనయుడు, రానా తమ్ముడు అభిరామ్‌ నటించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి అభిరామ్‌ డెబ్యూ మూవీ ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం. 

కథేంటంటే.. 
రఘు(అభిరామ్‌) ఓ పేద రైతు. తల్లిదండ్రులు చిన్నప్పుడు చనిపోవడంతో మేన మామ, అత్త(దేవీ ప్రసాద్‌, కల్పలత)దగ్గర పెరుగుతాడు. రఘు మరదలు అహల్య(గీతికా తివారి)కి బావ అంటే చాలా ఇష్టం. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఓ రోజు అహల్య  పొలం దగ్గరు ఉన్న రఘుకి టిఫిన్‌ బాక్స్‌ ఇచ్చి వెళ్తుంటే.. సిటీకి చెందిన ఇద్దరు కుర్రాళ్లు ఆమెపై హత్యాచారానికి పాల్పడుతారు. అనంతరం దారుణంగా కొట్టి అడవిలో పడేసి వెళ్తారు. 

తన మరదలికి జరిగిన అన్యాయంపై న్యాయ పోరాటం చేస్తాడు రఘు. అతని ఓ మహిళా లాయర్‌ లక్ష్మీ(సదా)తోడుగా నిలుస్తుంది. నిందితులిద్దరూ బడా వ్యాపారవేత్త ధనలక్ష్మి దుష్యంతరావు(రజత్‌ బేడీ) కొడుకులు కావడంతో ధర్మ పోరాటంలో రఘు ఓడిపోతారు. అంతేకాదు తనకు సహాయం చేసిన లాయర్‌ లక్ష్మీ, ఆమె భర్తను ధనలక్ష్మీ దుష్కంతరావు దారుణంగా చంపేస్తాడు. అహింసా మార్గంలో వెళ్తే తనకు న్యాయం జరగది భావించిన రఘు.. హింసని ఎంచుకుంటాడు. తన మరదలిపై హత్యాచారానికి పాల్పడిన దుండగులను చంపేయాలని డిసైడ్‌ అవుతాడు. దాని కోసం రఘు ఏం చేశాడు? వారిని ఎలా చంపాడు? అడవుల్లో గంజాయి సాగు చేసే లుంబ్డి గ్యాంగ్‌.. రఘును చంపాలని ఎందుకు ప్రయత్నించింది? దుష్కంతరావు కనబడకుండా పోవడానికి కారణం ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్‌లో అహింస మూవీ చూడాల్సిందే. 

ఎలా ఉందంటే.. 
టాలీవుడ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్స్‌లో తేజ ఒకరు. ఒకప్పుడు ఆయన సినిమాలు ఇండస్ట్రీలో రికార్డులు సృష్టించాయి. ఎంతో మంది హీరోలను తెలుగు తెరకు పరిచయం చేశాడు. చిత్రం, నువ్వు నేను, జయం లాంటి బ్లాక్‌ బస్టర్స్‌ అందించాడు. ఇక తేజ పని అయిపోందిలే అనుకుంటున్న సమయంలో రానాతో ‘నేనే రాజు నేను మంత్రి’ సినిమా తీసి మళ్లీ పుంజుకున్నాడు. ఆ తర్వాత ‘సీత’లాంటి డిజాస్టర్‌ మూవీని ఇచ్చినా.. ఈ సారి బ్లాక్‌ బస్టర్‌ పక్కా ఇస్తాడులే అని అభిమానులు ఎంతో నమ్మకంగా ఉన్నారు. కానీ  తేజ వారి నమ్మకాన్ని కాపాడుకోలేకపోయాడనిపిస్తుంది. పాత కథ, రొటీన్‌ స్క్రీన్‌ప్లేతో ‘అహింస’ను తెరకెక్కించాడు. 

చాలా సన్నివేశాలు తేజ తెరకెక్కించిన ‘జయం’, ‘నువ్వు నేను’ ‘ధైర్యం’ చిత్రాలను గుర్తుకు తెస్తాయి. ఇక లాజిక్కుల గురించి మాట్లాడుకోకపోవడం మంచిదేమో. కానిస్టేబుల్‌ పతంగి ఎగిరేసి అడవిలో ఉన్న హీరోకి సమాచారం అందించడం, కోర్టులోకి హీరో ప్రవేశించిన తీరు, సాక్ష్యాల కోసం హీరో చేసే ప్రయత్నాలు.. ఇలా ఏ ఒక్కటి రియలిస్టిక్‌గా ఉండదు. పైగా కథ మొత్తాని లాగినట్లుగా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో వచ్చే ఐటమ్‌ సాంగ్‌ అయితే మరీ దారుణం. ఇంట్లో శవాలను పెట్టుకొని ఐటమ్‌ పాట పాడించడం ఏంటో ఎవరీ అర్థం కాదు. అలాగే ఓ కానిస్టేబుల్‌ ఎందుకు వారికి సపోర్ట్‌గా నిలిచాడో అదీ తెలియదు. ఫస్టాఫ్‌ ఎండింగ్‌ సమయంలోనే క్లైమాక్స్‌ అర్థమైపోతుంది. సెకండాఫ్‌లో కథ మరీ సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ఒకనొక దశలో సినిమా ఇంకా అయిపోవట్లేదే అనే ఫీలింగ్‌ కలుగుతుంది. మొత్తంగా అహింస పేరుతో తేజ ప్రేక్షకులను హింసించారనే చెప్పాలి. 

ఎవరెలా చేశారంటే..
అభిరామ్‌కు ఇది తొలి సినిమా. ఉన్నంతలో రఘు తన పాత్రకు న్యాయం చేసేందుకు ట్రై చేశాడు. తేజ కూడా అభిరామ్‌పై పెద్దగా భారం వేయకుండా సన్నివేశాలను రాసుకున్నాడు. కానీ కొన్ని చోట్ల అభిరామ్‌ అనుభవలేమి కొట్టొచ్చినట్లు కనిపించింది. ఇక అహల్యగా గీతికా తివారి తనదైన నటనతో మెప్పించింది. తెరపై చాలా అందంగా కనిపించింది.  పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌మ‌ల్ కామ‌రాజు, లాయ‌ర్‌గా స‌దా తన పాత్రలకు న్యాయం చేశారు. విల‌న్‌గా న‌టించిన ర‌జ‌త్ బేడి, ఛటర్జీ పాత్ర పోషించిన వ్యక్తితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. 

ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఆర్పీ పట్నాయక్‌ సంగీతం పర్వాలేదు.  ‘ఉందిలే’ పాట మినహా మిగతావేవి అంతగా ఆకట్టుకోలేవు.   సమీర్‌ రెడ్డి సినిమాటోగ్రపీ బాగుంది. ఎడిటర్‌ తన కత్తెరకు చాలా పని చెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో చాలా సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్‌ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. 
 

Rating:
Advertisement
 
Advertisement