
వీధి కుక్కల బెడద ఎక్కువైపోతోంది. 11 సెకన్లకో కుక్కకాటు కేసు నమోదవుతోంది. పసికందులు, వృద్ధులపైనా వీధి కుక్కలు దాడి చేస్తున్నాయి. ఒక్క ఏడాదిలోనే (2024) దేశంలో 37 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయంటే సమస్య తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కుక్కదాడి వల్ల రేబిస్ సోకి ఎంతోమంది చనిపోతున్నారు.
భౌభౌ.. ఇక కనిపించొచ్చు, వినిపించొద్దు
ఈ తరుణంలో.. దేశ రాజధాని ఢిల్లీలో అన్ని కుక్కలను 8 వారాల్లోగా షెల్టర్లకు తరలించాని సుప్రీంకోర్టు సోమవారం (ఆగస్టు 11న) ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా దీన్ని అడ్డుకోవాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. న్యాయస్థానం తీర్పుపై సినీతారలు సోషల్ మీడియా వేదికగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
తరలించడం జరగదు, చంపేస్తారా?
తాజాగా హీరోయిన్ సదా మాట్లాడుతూ.. ఒక్క రేబిస్ కేసు కోసం 3 లక్షల కుక్కల్ని సిటీనుంచి తరలిస్తారు.. లేదా చంపేస్తారు. 8 వారాల్లో ప్రభుత్వం శునకాల కోసం షెల్టర్స్ ఎక్కడ? ఎలా? సిద్ధం చేయగలదు? ఇది జరగని పని! వాటికి ఆశ్రయం కల్పించడం సాధ్యపడదు కాబట్టి చివరకు చంపేస్తారు. మున్సిపల్ ఆఫీస్, ప్రభుత్వం.. వాటికి వ్యాక్సిన్ వేయకుండా ఏం చేసింది? ఏబీసీ (యానిమల్ బర్త్ కంట్రోల్) ప్రోగ్రామ్‌కు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ఉండుంటే పరిస్థితి ఇక్కడివరకు వచ్చేదే కాదు.
మా జేబులో నుంచి తీస్తున్నాం
జంతుప్రేమికులు, ఎన్జీవోలు.. తమ పరిధిలో ఉన్న కుక్కలు, పిల్లుల సంఖ్య పెరగకుండా తమశక్తిమేర ప్రయత్నిస్తున్నారు. వాటి ఆరోగ్యం బాగోలేదంటే మా జేబులో నుంచి డబ్బు తీసి చికిత్స అందిస్తున్నాం. ప్రభుత్వం ఆ మూగజీవాల కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం లేదు. వీధుల్లో శునకాలు ఉండకూడదన్న తీర్పు వచ్చేసింది. వాటి గురించి ఆలోచిస్తేనే మనసు ముక్కలవుతోంది. నాకేం చేయాలో తెలియడం లేదు.
లోలోపలే చచ్చిపోతున్నా..
ఎవరిని కలవాలి? ఎక్కడ నిరసన చేయాలి? ఏదీ తోచట్లేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను.. ఈ తీర్పు నన్ను లోలోపలే చంపేస్తోంది. వాటిని చంపడం కరెక్ట్ కాదు. మన దేశాన్ని చూస్తుంటే సిగ్గుగా ఉంది. దయచేసి ఈ తీర్పు వెనక్కు తీసుకోండి అంటూ సదా ఏడ్చేసింది. సదా ఒక్కరే కాదు.. జాన్వీ కపూర్, చిన్మయి శ్రీపాద, వరుణ్ ధావన్, సోనాక్షి సిన్హ, భూమి పెడ్నేకర్.. తదితర సెలబ్రిటీలు సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తున్నారు.
చదవండి: గుడ్‌న్యూస్ చెప్పిన 'రంగస్థలం' నటుడు.. బేబీ బంప్‌తో భార్య!