ఇటీవల బైసన్, కిష్కింధపురి, ది పెట్ డిటెక్టివ్ చిత్రాలతో అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) ట్రెండింగ్‌లో ఉంది. అయితే, కొన్ని రోజులుగా తాను ఎదుర్కొంటున్న సమస్య గురించి చెబుతూ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టింది. తమిళనాడుకు చెందిన ఒక యువతి తన ఫోటోలను మార్ఫింగ్ చేయడమే కాకుండా తన కుటుంబం గురించి అనుచితమైన పోస్టులు షేర్ చేస్తున్నట్లు ఆమె పేర్కొంది. దీంతో తాను పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపింది.
అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో ఇలా పేర్కొంది. 'కొద్దిరోజులుగా ఒక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా నా గురించి తప్పుగా పోస్టులు పెడుతున్నారు. ఇలాంటివి సర్వసాధారణమేనని మొదట పట్టించుకోలేదు. అయితే, నా ఫోటోలను మార్ఫింగ్ చేసి ఏకంగా నా కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, సహ నటీనటులకు కూడా ట్యాగ్ చేస్తున్నారు. దీంతో చాలా బాధపడ్డాను. ఆపై ఎలాంటి ఆధారాలు లేకుండానే నా గురించి తప్పుడు సమాచారం వైరల్ చేస్తున్నారు. వాటిని చూస్తుంటే ఎవరో కావాలనే నన్ను టార్గెట్ చేస్తున్నట్లు అర్థమైంది.
దీంతో ఈ విషయం గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేశాను. ఒకే వ్యక్తి చాలా అకౌంట్లతో ఈ సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు ఫైనల్‌గా తెలిసింది. నేను ఏదైనా పోస్ట్ చేసినా కూడా ఫేక్ అకౌంట్ల నుంచి తప్పుడు కామెంట్లు చేస్తున్నారు. దీంతో వెంటనే కేరళ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాను.' అని అనుపమ తెలిపింది.
యువతి వివరాలు గోప్యంగా ఉంచండి
సైబర్ క్రైమ్ పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో ఆశ్యర్యపోయే విషయం వెలుగులోకి వచ్చిందని అనుపమ ఇలా చెప్పింది. ' ఇదంతా చేసింది తమిళనాడుకు చెందిన 20 ఏళ్ల యువతి అని తెలిసి ఆశ్చర్యపోయాను. ఆమె వయసులో చాలా చిన్నది. తన భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఆమె ఐడెంటిటీని బయటి ప్రపంచానికి చెప్పదలుచుకోలేదు. అయితే, ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుని వెళ్తుంది.
ఇప్పుడు కూడా ఈ ఘటన గురించి చెప్పాలని నాకు లేదు. కానీ, యువత మేలుకోవాలనే ఉద్దేశంతో ఈ విషయాన్ని చెబుతున్నాను. చేతిలో ఫోన్ ఉందని, సోషల్ మీడియా అకౌంట్ ఉందని ఒకరి పరువు తీసే హక్కు మీకు లేదు. ఇతరులను ద్వేషిస్తూ ఆన్‌లైన్‌లో మేరు చేసే ప్రతిదీ ట్రాక్ అవుతుంది. ప్రజలు బాధ్యతాయుతంగా ఉండాలి. సెలబ్రిటీలు అయినంత మాత్రానా మాకు కూడా సామాన్యులకు ఉండే హక్కులు ఉంటాయి. చట్టం అందరికీ సమానమే.' అని తెలిపారు.


