నటీమణులపై లైంగిక వేధింపుల వ్యవహారంలో కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హేమా కమిటీ ప్రభావం ఇతర ఇండస్ట్రీల్లోనూ చర్చనీయాంశమైంది. దీంతో దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) మహిళలపై లైంగిక వేధింపుల వ్యవహారంలో చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. తాజాగా నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ మహిళల రక్షణ కోసం పలు వ్యాఖ్యలు చేశారు. విశాఖ కమిటీ సూచనల మేరకు నటీమణుల కోసం ఎస్‌ఐఏఏ–జీఎస్‌ఐసీసీ పేరుతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామన్నారు. దీనికి నటి రోహిణి అధ్యక్షురాలిగానూ, నటీమణులు సుహాసిని, ఖుష్బూ సభ్యులుగానూ వ్యవహరిస్తున్నారు. ఈ కమిటీకి ఒక న్యాయవాదిని కూడా నడిగర్ సంఘం నియమించింది.
తమిళ చిత్రపరిశ్రమలో విశాఖ కమిటీ వేశామని, ఇప్పటికే కొన్ని సమస్యలను కూడా పరిష్కరించామని నాజర్ తెలిపారు. పరిశ్రమలోని మహిళలకు లైంగిక వేధింపులుంటే తమకు ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు. అలాంటి వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని, పరిష్కారాలు చూపుతామని నాజర్ అన్నారు.
మహిళలపై లైంగిక వేధింపులు అన్ని రంగాల్లోనూ ఉన్నాయని నాజర్ గుర్తుచేశారు. అయితే, సినిమా ఇండస్ట్రీలోని వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు మాత్రం చాలా కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. చిత్ర పరిశ్రమకు చెందిన వారు ఎవరైనా సరే.. సమస్యలు ఉంటే తమను సంప్రదించవచ్చని ఆయన అన్నారు. మహిళల రక్షణకు నడిగర్ సంఘం అండగా ఉంటుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment