ఈవీవీ సత్యనారాయణ పేరు చెప్పగానే ఎక్కువగా కామెడీ సినిమాలే గుర్తొస్తాయి. జంబలకిడి పంబ, ఎవడిగోల వాడిది, కితకితలు.. ఇలా చెప్పుకొంటూ పోతే పాత నుంచి కొత్త వరకు చాలానే ఉంటాయి. అయితే ఈయన బోల్డ్ అండ్ రియలస్టిక్ కామెడీ కాన్సెప్ట్‌తో 'ఆరుగురు పతివ్రతలు' అనే మూవీ తీశారు. 20 ఏళ్ల క్రితం థియేటర్లలో రిలీజై ఆకట్టుకుంది. ఇప్పుడు బిగ్ స్క్రీన్‌పై రీ రిలీజ్ కానుందనే వార్త చర్చనీయాంశంగా మారింది.
(ఇదీ చదవండి: పదే పదే ఇబ్బంది పెట్టాడు.. రాయితో తల పగలగొట్టా: కాయదు లోహర్)
ఈవీవీ సత్యనారాయణ దర్శకనిర్మాతగా చేసిన 'ఆరుగురు పతివ్రతలు'.. 2004 ఫిబ్రవరి 6న థియేటర్లలో రిలీజైంది. పెళ్లి పేరిట జరిగే మోసాలు, వైవాహిక బంధంలో భార్యభర్తల మధ్య ఉండే ఈగోలు, రకరకాల పరిస్థితులు, మనస్పర్థలని బోల్డ్‌గా చూపించారు. సమాజంలోని కొన్ని చేదు నిజాల్ని కామెడీగా చూపించారు. అయితే తర్వాత కాలంలో టీవీ, సోషల్ మీడియాలో కల్ట్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని ఇప్పుడు రీ రిలీజ్ చేస్తున్నారని కొన్ని పోస్టర్స్ వైరల్ అవుతున్నాయి.
ఎప్పుడు రీ రిలీజ్ అనే తేదీ వేయని పోస్టర్స్ వైరల్ అవుతున్నాయి. నిజంగానే మళ్లీ థియేటర్లలోకి తీసుకొస్తారా? లేదంటే ఎవరైనా ఆకతాయి.. అటెన్షన్ కోసం కావాలనే ఈ పోస్టర్‌ని వదిలాడా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ నిజంగానే రీ రిలీజైతే మాత్రం యూత్ నుంచి మంచి రెస్పాన్స్ ఉండే అవకాశముంది.
'ఆరుగురు పతివ్రతలు' విషయానికొస్తే.. పదో క్లాస్ కలిసి చదువుకున్న ఆరుగురు అమ్మాయిలు.. పెరిగి పెద్దయిన తర్వాత చాలా ఏళ్లకు ఓ పెళ్లి సందర్భంగా కలుస్తారు. అలా కలిసిన సందర్భంలో తమ పెళ్లి జీవితాల్లో ఎదుర్కొంటున్న కష్టసుఖాలు, భర్తల ప్రవర్తన గురించి ఒకరికొకరు పంచుకుంటారు. అయితే భర్తలని అర్థం చేసుకోవడంలో భార్యల ఆలోచనలు ఎలా ఉంటాయి? భర్తల అనుమాన స్వభావం వల్ల వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయి? అనే అంశాలే స్టోరీ.
(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)


