కియారా అద్వానీ, సైఫ్ అలీఖాన్ తొలిసారి కలిసి నటించనున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రచయిత్రి, నిర్మాత కనికా ధిల్లాన్ తెరకెక్కించనున్న ఓ థ్రిల్లర్ సినిమాలో వీరిద్దరూ జోడీగా కనిపించనున్నట్లు సమాచారం. ఈ చిత్రంతో కనికా దర్శకురాలిగా పరిచయం కానున్నారు. ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో చిత్రీకరణ ప్రారంభించే యోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
దర్శకురాలిగా కనికా..
కనికా ధిల్లాన్ ఇప్పటికే ‘మన్మర్జియాన్’, ‘కేదార్‌నాథ్’, ‘జడ్జ్‌మెంటల్ హై క్యా?’, ‘హసీన్ దిల్‌రుబా’, ‘రష్మి రాకెట్’, ‘రక్షాబంధన్’, ‘డంకీ’ తదితర చిత్రాలకు రచయితగా పనిచేశారు. ‘హసీన్ దిల్‌రుబా’, ‘ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రుబా’తో థ్రిల్లర్ కథలను తెరకెక్కించారు. ‘దో పట్టీ’ చిత్రానికి రచనతో పాటు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. తాజా చిత్రంతో మెగాఫోన్ పట్టనున్నారు.
కాగా, కియారా ప్రస్తుతం యశ్ కథానాయకుడిగా నటించిన ‘టాక్సిక్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మరోవైపు సైఫ్ అలీఖాన్.. ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హైవాన్’లో అక్షయ్‌కుమార్‌తో కలిసి నటిస్తున్నారు. తాజా చిత్రానికి సంబంధించిన టైటిల్, ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.


