బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘హనుమాన్ అంశ్’ మూవీ తెలుగులో ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. శోభినవ్ సత్య, చందన్ కె. ఆనంద్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘హనుమాన్ అంశ్’. విశాల్ చతుర్వేది దర్శకత్వంలో విశాల్ చతుర్వేది, నమ్రత జి. సింగ్, అనుప్రియ నాగర్, రాగిణి సోనా నిర్మించిన ఈ హిందీ చిత్రం ఆగస్టు 7న బాలీవుడ్‌లో విడుదలైంది. 1900–1973 మధ్య జీవించిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, హనుమాన్ భక్తుడు నీమ్ కరోలి బాబా (మహారాజ్ జీ) జీవితం, ఆయన బోధనల ఆధారంగా ఈ సినిమా రూ పొందింది.
రూ. 2 కోట్లతో రూ పొందిన ఈ చిత్రం రూ. 400 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం. ఈ సినిమాని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సెప్టెంబరు 18న తెలుగులో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే చివరి నిమిషంలో తెలుగు విడుదలను వాయిదా వేశారు. తాజాగా ఈ నెల 9న తెలుగు వెర్షన్‌ని విడుదల చేస్తున్నట్లు హోంబలే ఫిల్మ్స్ ప్రకటించింది. ‘‘ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా పెద్ద తెరపై దైవిక వైభవాన్ని వీక్షించేలా ఎంతో ఆదరణ పొందిన ‘హనుమాన్ అంశ్’ చిత్రాన్ని తెలుగులో తీసుకురావడం హ్యాపీగా ఉంది’’ అని ఆ సంస్థ పేర్కొంది.


