దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మరోసారి క్రైమ్ జానర్‌లో తనదైన ముద్ర వేయడానికి సిద్ధమవుతున్నారు. ఆయన తెరకెక్కిస్తున్న ‘పోలీస్ కంపెనీ’ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించినట్లు సమాచారం. ఈ చిత్రంలో నటుడు హర్షవర్ధన్ రాణే ప్రధాన పాత్రలో కనిపించనున్నారట. ముంబైలోని ఓ పోలీసు ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారని సమాచారం. ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభమైనట్లు తెలుస్తోంది.
తొలుత ఈ ప్రాజెక్ట్‌ను వెబ్‌సిరీస్‌గా రూపొందించాలని నిర్మాతలు భావించినప్పటికీ కథలోని పాత్రల బలం, యాక్షన్ అంశాలను దృష్టిలో పెట్టుకుని రామ్‌గోపాల్ వర్మ దీన్ని రెండు భాగాల సినిమాగా తెరకెక్కించాలని సూచించినట్లు టాక్.
2027లో కొన్ని నెలల వ్యవధిలో..
టీ-సిరీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలోని రెండు భాగాలను ఒకేసారి చిత్రీకరించి, 2027లో కొన్ని నెలల వ్యవధిలో థియేటర్లలో విడుదల చేయాలని ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం. ‘పోలీస్ కంపెనీ’లో దయా నాయక్ చిన్ననాటి నుంచి ముంబై పోలీస్ వ్యవస్థలో ఆయన ఎదిగిన తీరును చూపించనున్నారట. 1990ల చివరి దశ, 2000ల ప్రారంభంలో ముంబై అండర్‌వరల్డ్‌పై పోలీసులు చేపట్టిన ఆపరేషన్లు కథలో ప్రధానాంశంగా ఉండనున్నాయని తెలుస్తోంది.
ఇదీ చదవండి: బీజేపీలో చేరిన కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ


