మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇరుముడి’. ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్‌ను పొందింది. ఈ చిత్ర నిడివిని 2 గంటల 25 నిమిషాలుగా ఖరారు చేశారు.
కుటుంబ భావోద్వేగాలు, సస్పెన్స్, యాక్షన్, గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో రవితేజ కుమార్తె పాత్రలో బేబీ నక్షత్ర నటించగా, వారిద్దరి మధ్య ఉండే అనుబంధమే కథకు ప్రధాన బలంగా నిలవనుందని చిత్ర బృందం చెబుతోంది.
మద్యానికి బానిసైన వ్యక్తిగా..
ఈ చిత్రంలో రవితేజ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిగా కనిపించనున్నారు. మద్యానికి బానిసైన అతడి జీవితంలో అయ్యప్ప మాల ధరించిన తర్వాత ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయన్నది కథలో కీలకాంశంగా ఉండనుందట. గ్రామంలోని మహిళలను తన కుమార్తెల్లా చూసుకునే అతడి స్వభావం కూడా కథను మలుపు తిప్పనుందని సమాచారం.
సహజమైన గ్రామీణ ప్రాంతాల్లో చిత్రీకరణ జరపడంతో కథకు మరింత సహజత్వం వచ్చిందని చిత్ర యూనిట్ పేర్కొంది. రవితేజ సరసన ప్రియ భవానీ శంకర్ నటించగా, సాయికుమార్, అజయ్ ఘోష్, స్వాసిక కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు.


