మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ మరో కొత్త చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు. దర్శకుడు అనూప్ సత్యన్‌తో కలిసి ఆయన ఓ చిత్రాన్ని చేయనున్నట్లు సోషల్‌మీడియా వేదికగా వెల్లడించారు. నిర్మాతలు బిను జార్జ్ అలెగ్జాండర్, ఆంటోని పెరుంబవూర్‌లో కలిసి దిగిన ఫొటోలను పంచుకుంటూ ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ చిత్రం నవంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం.
దర్శకుడు అనూప్ మాట్లాడుతూ.. ‘తండ్రి సత్యన్ ఆంథికాడ్ చిత్రాల శైలికి పూర్తిగా ఇది భిన్నంగా ఉంటుంది. యాక్షన్, కామెడీ, థ్రిల్లర్, భావోద్వేగాల వంటి అంశాలతో ఈ సినిమా రూపొందిస్తున్నాం. మోహన్‌లాల్‌కు గత వారమే కథ వినిపించా.. ఆయనకు నచ్చడంతో సినిమాకు సంబంధించిన పనులు ప్రారంభించాలని నిర్ణయించుకున్నాం’ అని తెలిపారు. నటీనటులు, సాంకేతిక బృందానికి సంబంధించిన వివరాలు ఇంకా ఖరారు కాలేదని, ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.


