మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఇరుముడి’. ఆగస్ట్ 21న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా సినిమాలోని ఓ పాటలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేకంగా కనిపించనున్నారంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై తాజాగా రామ్ చరణ్ టీమ్ స్పందించింది.
‘ఇరుముడి’ సినిమాలో ‘మల్లెపూల పల్లకి.. బంగారు పల్లకి’ అంటూ సాగే పాటలో రామ్ చరణ్ అయ్యప్ప మాలధారణలో కనిపించనున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్‌గా మారాయి. ఈ పాటలో ఆయన ప్రత్యేకంగా కనిపించనున్నారని, ఇది సినిమాకు సర్‌ప్రైజ్ ఎలిమెంట్‌గా ఉండబోతోందంటూ అభిమానులు, నెటిజన్లు చర్చించుకున్నారు.
ఈ ప్రచారానికి ‘ఇరుముడి’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చాయి. సినిమాలోని ‘మల్లెపూల పల్లకి.. బంగారు పల్లకి’ పాటలో అదిరిపోయే సర్‌ప్రైజ్ ఉంటుందని ఆయన చెప్పడంతో.. ఆ సర్‌ప్రైజ్ రామ్ చరణ్‌నే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. దీంతో మెగా అభిమానుల్లోనూ ఆసక్తి పెరిగింది.
అయితే తాజాగా ఈ వార్తలకు చెక్ పడింది. రామ్ చరణ్ ‘ఇరుముడి’ సినిమాలో నటించారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన టీమ్ ఖండించింది. సినిమాలో రామ్ చరణ్ కనిపించనున్నారనే వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇలాంటి నిర్ధారణ లేని వార్తలను ప్రచారం చేయొద్దని కూడా రామ్ చరణ్ టీమ్ విజ్ఞప్తి చేసింది.
దీంతో ‘ఇరుముడి’లో రామ్ చరణ్ గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వనున్నారనే ప్రచారానికి తెరపడినట్లైంది. ప్రీరిలీజ్ ఈవెంట్‌లో జీవీ ప్రకాశ్ చెప్పిన సర్‌ప్రైజ్ ఏంటనే ఆసక్తి మాత్రం ప్రేక్షకుల్లో కొనసాగుతోంది. ఆ సర్‌ప్రైజ్ ఏమిటన్నది సినిమా విడుదలైన తర్వాతే స్పష్టత రానుంది.


