వరదను ఒడిసిపడ్తయ్‌! | - | Sakshi
Sakshi News home page

వరదను ఒడిసిపడ్తయ్‌!

Nov 16 2026 8:41 AM | Updated on Nov 16 2026 8:41 AM

మెదక్‌– బోధన్‌ హైవే వెంట ఇంకుడు గుంతలు

నీటి మట్టం పెరుగుతుంది

వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ఎన్‌హెచ్‌ఏఐ (నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా) చర్యలు చేపట్టింది. ఈ మేరకు నూతనంగా నిర్మిస్తున్న హైవేలకు ఇరువైపులా ఇంకుడు గుంతలు నిర్మిస్తోంది. ప్రతీ కిలోమీటర్‌కు రెండు చొప్పున గుంతలు నిర్మించాలని మార్గదర్శకాలు జారీ చేసింది. కాంట్రాక్టు ఒప్పందంలో భాగంగా దీనిని చేర్చింది. ఎల్‌నినో నేపథ్యంలో నీటి సంరక్షణతో పాటు భూగర్భజలాల పెంపునకు ఇవి దోహదపడనున్నాయి.

– రామాయంపేట(మెదక్‌)

మెదక్‌ నుంచి జిల్లా సరిహద్దు నిజాంపేట వరకు 39 కిలోమీటర్ల మేర 765 డీజీ జాతీయ రహదారి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మరో వైపు జిల్లా కేంద్రం నుంచి బోధన్‌ రూట్‌లో జిల్లా పరిధిలో 58 కిలోమీటర్ల మేర 765డీ హైవే నిర్మాణ పనులు సాగుతున్నాయి. కాగా, ప్రస్తుతం 765డీ పరిధిలో మాత్రమే ఇంకుడు గుంతలు నిర్మిస్తున్నారు. రహదారి విస్తరణ పనుల్లో భాగంగా వర్షం నీరు సంరక్షణకు అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారు. మెదక్‌ నుంచి ఎల్లారెడ్డి వరకు 44 కిలోమీటర్ల మేర మొత్తం 88 ఇంకుడు గుంతలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 55 గుంతల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఒక్కొ ఇంకుడు గుంత నిర్మాణానికి రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు ఖర్చువుతుంది. గతంలో నిర్మించిన జాతీయ రహదారులపై కనిపించని ఈ నిర్మాణాలు ఈ మార్గంలో చేపడుతుండటంతో ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.

రైతులకు మేలు.. రోడ్డుకు రక్షణ

మెదక్‌, ఎల్లారెడ్డి ప్రాంతాల్లో భూగర్భజలాలు అడుగంటాయి. ఈక్రమంలో రహదారిపై పడే వర్షం నీరు వృథాగా పోకుండా నేరుగా భూమిలోకి ఇంకించడంతో బోర్లలో నీటి మట్టం పెరుగుతుంది. మరో వైపు వర్షం నీరు రోడ్డుపై నిలువకుండా భూమిలోకి ఇంకిస్తే రోడ్డు సైతం దెబ్బతినే అవకాశం ఉండదు.

నిర్మాణాల్లో నాణ్యత

హైవేలపక్కన నిర్మిస్తున్న ఇంకుడు గుంతల నిర్మాణానికి గానూ ఆశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ నిబంధలన మేరకు వీటిని నిర్మిస్తున్నట్లు వారు చెబుతున్నారు. వర్షం నీరు రోడ్డు పక్కన నిలిస్తే తా రు రోడ్డు దెబ్బతింటుంది. నిలిచినా నెమ్మదిగా రోడ్డు అడుగు భాగంలోని మట్టి పొరల్లో ఇంకితే మట్టి మెత్తబడి పైన భారీ వాహనాలు వెళ్లినప్పుడు రోడ్డు కుంగిపోయే అవకాశం ఉంటుంది. ఇంకుడు గుంతలతో నీరు రోడ్డు పక్కన నిలిచే అవకాశం ఉండదు.

అర కిలోమీటర్‌కు ఒకటి చొప్పన నిర్మాణం

ఒక్కో గుంత నిర్మాణానికి రూ. లక్ష వరకు ఖర్చు

భూగర్భ జలాల పెంపునకు చర్యలు

నూతనంగా నిర్మిస్తున్న 765డీ జాతీయ రహదారికి ఇరువైపులా ఇంకుడు గుంతల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మెదక్‌–ఎల్లారెడ్డి మధ్య 44 కిలోమీటర్ల దూరానికి మొత్తం 88 గుంతలు నిర్మించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు 55 గుంతల నిర్మాణం పూర్తయింది. వీటి నిర్మాణంతో భూమిలో నీటి మట్టం పెరుగుతుంది.

– వినోద్‌, ఏఈఈ, ఎన్‌హెచ్‌ఏఐ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement