● మంత్రి దామోదర రాజనర్సింహ
● జిల్లాలో 11 వేల మందికి పెన్షన్లు మంజూరు
టేక్మాల్(మెదక్): అర్హులైన అన్నివర్గాలకు ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నూతన చేయూత పెన్షన్ల కార్యక్రమాన్ని చేపట్టిందని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం మండలంలోని బొడ్మట్‌పల్లిలో లబ్ధిదారులకు నూతన పెన్షన్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసి మాట్లాడారు. ఒక్క మెదక్ జిల్లాలోనే 11 వేల పింఛన్లు మంజూరయ్యాయని తెలిపారు. పార్టీలకతీతంగా అర్హులందరికీ మంజూరు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఆర్థికంగా స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మహిళా సంఘాలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందిస్తోందన్నారు. ఇందిరమ్మ క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, డ్రోన్ల నిర్వహణ వంటి రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని వివరించారు. గుడిసెలు లేని సమాజాన్ని నిర్మించాలనే సంకల్పంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఏటా 3,800 ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. విడతలవారీగా ఇళ్లు మంజూరు చేస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా రెవెన్యూ అధికారి అంబదాస్ రాజేశ్వర్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, మెదక్ ఆర్టీఓ రామకృష్ణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పట్లోళ్ల విష్ణువర్ధన్ రెడ్డి, శేషారెడ్డి, దిగంబరరావు, సర్పంచ్ అవినాశ్, ఎంపీడీఓ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


