కేజీబీవీల్లో చన్నీటి గోస! | - | Sakshi
Sakshi News home page

కేజీబీవీల్లో చన్నీటి గోస!

Nov 16 2026 8:41 AM | Updated on Nov 16 2026 8:41 AM

పనిచేయని సోలార్‌ హీటర్లు

నిధులు లేవు

కేజీబీవీ (కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు)లో చదువుకునే పేద విద్యార్థినులకు చన్నీళ్ల స్నానమే దిక్కవుతోంది. జిల్లాలో పెరుగుతున్న చలి తీవ్రతతో వారు అవస్థలు పడుతున్నారు. పాఠశాలల్లో అమర్చిన సోలార్‌ హీటర్లు పనిచేయటం లేదు. వాటికి మరమ్మతులు చేయించాల్సిన అధికారులు పట్టించుకోవటం లేదు. ఫలితంగా విద్యార్థినులు చన్నీళ్లతో స్నానం చేయడం వల్ల తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారు. – మెదక్‌జోన్‌

జిల్లావ్యాప్తంగా 19 కేజీబీవీలు ఉండగా, వాటిలో ఎనిమిదింటిలో 6 నుంచి 12వ తరగతి వరకు కొనసాగుతుండగా, మరో 11 విద్యాలయాల్లో 6 నుంచి 10వ తరగతి వరకు కొనసాగుతున్నాయి. వీటిలో 4,257 మంది బాలికలు చదువుకుంటున్నారు. ఇందులో నిరుపేద కుటుంబాలకు చెందిన బాలికలకు మాత్రమే అడ్మిషన్లు ఇస్తారు. కాగా. గత 15 రోజులగా జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. రాత్రివేళల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు ఏకంగా 12 డిగ్రీలకు పడిపోతున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు చలి వదలడం లేదు. దీనికి తోడు మంచు కురుస్తుండటంతో తీవ్రత మరింత పెరుగుతుంది. బాలికలకు స్నానాల కోసం వేడి నీటిని అందించేందుకు కొన్నేళ్ల క్రితం జల్లాలోని అన్ని కేజీబీవీల్లో సోలార్‌ పలకలను అమర్చి హీటర్లను ఏర్పాటు చేశారు. కానీ వాటిలో మూడు పాఠశాలల్లో మాత్రమే అవి పనిచేస్తుండగా, మిగతా 16 కేజీబీవీల్లో పనిచేయటం లేదు. దీంతో చేసేది లేక విద్యార్థినులు చన్నీళ్ల స్నానం చేస్తున్నారు.

అలంకారప్రాయంగా..

కేజీబీవీల్లో చదువుకునే విద్యార్థినులకు చలికాలంలో వేడి నీటిని అందించాలనే లక్ష్యంతో 2017లో అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని కేజీబీవీల్లో రూ. లక్షలు వెచ్చించి సోలార్‌ పలుకలు అమర్చి హీటర్లు ఏర్పాటు చేసింది. వాటిలో చాలా వరకు కనెక్షన్లు ఇవ్వకుండానే చెడిపోయాయి. కొన్ని గాలి దుమారానికి పలకలు విరిగిపోగా, మరికొన్నింటిని కోతులు ధ్వంసం చేశాయి. దీంతో వాటిని ప్రారంభించకుండానే మూలకు చేరాయి.

పట్టింపేది..?

చన్నీళ్ల స్నానంతో విద్యార్థినులు అనారోగ్యం బారిన పడుతున్నా, సంబంధిత అధికారులు, పాలకులు పట్టించుకున్న పాపాన పోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. విద్యకు పెద్దపీట వేస్తున్నామంటున్న పాలకులు నిరుపేద బాలికలు చదువుకునే కేజీబీవీలను మాత్రం పట్టించుకోవడం లేదు. ఇటీవల మెదక్‌ కేజీబీవీలో కరెంట్‌, నీటి సమస్య ఉత్పన్నం అయి రోజుల తరబడి విద్యార్థినులు స్నానాలు చేయని పరిస్థితి. మీడియా ద్వారా విషయం బయటకు పొక్కడంతో స్పందించిన ఎంపీ రఘునందన్‌రావు బోరు బావి తవ్వించి కరెంట్‌ సమస్యకు పరిష్కారం చూపారు. ప్రస్తుతం చన్నీళ్ల స్నానంతో ఇబ్బంది పడుతున్న బాలికలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది.

చలికి వణుకుతున్న విద్యార్థినులు

మరమ్మతులు చేయించని అధికారులు

జిల్లాలో 19 పాఠశాలలు.. 4 వేల పైచిలుకు బాలికలు

జల్లావ్యాప్తంగా 19 కేజీబీవీలు ఉండగా, మూడింటిలో సోలార్‌ పనిచేస్తుండా, మిగతా పదహారింటిలో పనచేయటంలేదు. కాగా వాటికి మరమ్మతులు చేపించేందుకు నిధులు లేవు. ఈ విషయాన్ని గతంలోనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లటం జరిగింది.

– జగదీశ్వరీ, జీసీడీఓ, మెదక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement