రేగోడ్(మెదక్): ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ సర్కారుకు ప్రజలు బుద్ధి చెప్పాలని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం మండల కేంద్రంలో ‘వెయ్యి రోజుల దగా’పై పోరుబాట నిర్వహించారు. ఈసందర్భంగా క్రాంతికిరణ్ మాట్లాడుతూ.. రేగోడ్, అల్లాదుర్గం, టేక్మాల్ మండలాలను సంగారెడ్డి జిల్లాలో కలుపుతామని ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ నేతలను నిలదీయాలన్నారు. బసవేశ్వర, సంగమేశ్వర పథకాలను తుంగలో తొక్కారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు మంగళం పాడారన్నారు. సమస్య వచ్చినా ప్రజలకు అండగా ఉండాలని బీఆర్‌ఎస్ నేతలకు సూచించారు. బాకీ కార్డులను ఇంటింటికీ పంపిణీ చేయాలన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు జైపాల్‌రెడ్డి, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి రమేశ్, మాజీ అధ్యక్షుడు వినోద్‌కుమార్, పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్, మాజీ ఎంపీటీసీ నర్సింహులు, గ్రామ అధ్యక్షుడు సుభాశ్ తదితరులు పాల్గొన్నారు.


