విడుదలవుతున్న ఇందిరమ్మ బిల్లులు
జిల్లావ్యాప్తంగా గతేడాది జూలైలో మొదటి విడత ఇందిరమ్మ పథకంలో 8,910 ఇండ్లు మంజూరయ్యాయి. ఇటీవల పూర్తిగుడిసెలు గల 727 కుటుంబాలను గుర్తించి వారికి సైతం ఇళ్లు మంజూరు చేయటంతో ఆ సంఖ్య 9,637కు చేరుకుంది. కాగా అందులో 2,290 నేటికీ ప్రారంభించలేదు. మరో 890మంది బేస్మెంట్ ప్రారంభించేందుకు గుర్తులు పెట్టుకున్నారు. 1,183 బేస్మెంట్ లెవల్ పూర్తయినవి, రూఫ్‌లెవెల్ కంప్లీట్ అయినవి 645, స్లాబ్‌వరకు అయినవి 2,434 కాగా పూర్తిగా సిద్ధమైనవి 2,195.
ఆరు నెలల తర్వాత ఫైనల్‌బిల్లు
జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 2,195 ఇళ్లు పూర్తి కాగా ఆరునెలలుగా ఫైనల్‌బిల్లులు ఆగిపోవటంతో అప్పులు చేసి నిర్మించుకున్న లబ్ధిదారులు బిల్లులకోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఆందోళన చెందారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.10 నుంచి రూ.15 లక్షల వరకు వెచ్చించి నిర్మించుకున్నారు. కాగా, ప్రభుత్వం రూ.5 లక్షలు ఇస్తుందనే ధీమాతో బయట అప్పులు చేశారు. కేంద్రం ఏకంగా 6 నెలల పాటు బిల్లులు ఆపటంతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలంటేనే జంకే పరిస్థితి నెలకొంది. కాగా గత 15 రోజుల నుంచి ఆఖరు బిల్లులు సైతం విడుదలవుతుండటంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇప్పటివరకు కంప్లీట్ అయిన ఇల్లు 2,195కాగా ఫైనల్ బిల్లులు 535మంది కి వచ్చింది. ఇంకా 1,660 మందికి త్వరలో వస్తుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఆఖరు బిల్లులు మంజూరవుతుండటంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఈ పథకం కోసం రూ.5 లక్షల చొప్పున మంజూరు కాగా అందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఒక్కో ఇంటికి రూ.3.88 లక్షలు ఇస్తుండగా, కేంద్ర ప్రభుత్వం వాటా కింది రూ.1.12 లక్షలను ఇస్తోంది. కాగా, ఇళ్లు పూర్తయిన లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు బిల్లులు ఇవ్వగా కేంద్రం విడుదల చేసే ఆఖరుబిల్లులు ఆలస్యం కావటంతో అప్పులు చేసి నిర్మించిన లబ్ధిదారులు ఆందోళన చెందారు. కాగా, ఇటీవల ఆఖరుబిల్లులు సైతం మంజూరు కావటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. –మెదక్‌జోన్
సంతోషం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు ఇప్పటివరకు 2,195 ఇళ్లు పూర్తి
535 మంది లబ్ధిదారులకు చేరిన డబ్బులు
ఒక్క పూరిగుడిసె ఉండకూడదు
జిల్లాలో ప్రతీ కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలని, పూరిగుడిసెలు మాత్రం ఉండకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మంజూరైన ఇళ్లల్లో కొన్నింటిని నేటికీ ప్రారంభించకపోయినప్పటికీ వారి పేర్లను రద్దు చేయకుండా అలాగే ఉంచుతున్నారు. అందుకు ప్రధాన కారణం వారిలో అత్యధికులు పూరిగుడిసెలు, రేకుల షెడ్లు ఉన్నవారు కావడంతో వారికి మంజూరైన ఇళ్లను రద్దు చేయటం లేదు. ఇక వారు నిర్మించుకోవటమే ఆలస్యమని అధికారులు చెబుతున్నారు. కాగా రెండోవిడత సైతం త్వరలో మంజూరవుతాయని వారు పేర్కొన్నారు.


