తాగునీటి కటకట | - | Sakshi
Sakshi News home page

తాగునీటి కటకట

Sep 6 2026 8:31 AM | Updated on Sep 6 2026 8:31 AM

పైప్‌లైన్‌ చివరి గ్రామాలకు గ్రిడ్‌ నీటి సరఫరా బంద్‌

మంజీరా ప్రవాహం తగ్గడంతో డబ్ల్యూటీపీ అందని నీళ్లు

రాఘవాపూర్‌, పాంపాడ్‌ డబ్ల్యూటీపీల్లో సామర్థ్యంలో సగమే పంపింగ్‌

ఇప్పుడే ఇలా ఉంటే..వేసవిలో సమస్య తీవ్రతపై ఆందోళన

మిషన్‌భగీరథ రాఘవాపూర్‌ వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంటు (డబ్ల్యూటీపీ) సామర్థ్యం రోజుకు 19 మిలియన్‌ లీటర్లు. కానీ మంజీరా నదిలో నీళ్లు లేని కారణంగా ప్రస్తుతం రోజుకు ఏడు నుంచి పది మిలియన్‌ లీటర్లు మాత్రమే పంప్‌ చేస్తున్నారు. ఇక్కడ 24 గంటలు పంపింగ్‌ జరిగితే దీని పరిధిలో ఉన్న 74 గ్రామాలకు తాగునీరు సరఫరా అవుతుంది. కానీ సగం కూడా పంపింగ్‌ జరగకపోవడంతో ఝరాసంగం వంటి మండలాలకు అసలు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆయా గ్రామాల్లో స్థానికంగా ఉన్న బోర్ల ద్వారా అరకొరగా నీటిని సరఫరా చేస్తున్నారు.

నీటి లభ్యత తగ్గడంతో పలు తాగునీటి పథకాల నుంచి పంపింగ్‌ తగ్గించాల్సి వస్తోందని వాటర్‌గ్రిడ్‌ ఈఈ విజయలక్ష్మి ‘సాక్షి’తో పేర్కొన్నారు. ఉన్న నీటితో వీలైనంత ఎక్కువ గ్రామాలకు సరఫరా చేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో తాగునీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించామని మిషన్‌భగీరథ ఈఈ పాష పేర్కొన్నారు. సమస్య తీవ్రమైతే బోర్లను అద్దెకు తీసుకోవడం, ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షాకాలంలోనే తాగునీటి కటకట షురూవైంది. తాగునీటికి ప్రధాన ఆధారమైన మంజీరా నది వెలవెలబోతుండటంతో తాగునీటి సమస్య ఇప్పటి నుంచే ప్రారంభమైంది. వర్షాకాలంలోనే పరిస్థితి ఇలా ఉంటే రానున్న వేసవిలో తాగునీటి పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లా తాగునీటి అవసరాలు తీర్చే ప్రధాన నీటి వనరు అయిన సింగూరు జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 29.91 టీఎంసీలకుగాను, ప్రస్తుతం 4.49 టీఎంసీలు నీళ్లు మాత్రమే ఉన్నాయి. కేవలం 515 అడుగుల మేరకు మాత్రమే నీటి మట్టం ఉంది. దీంతో తాగునీటి సమస్య షురూవైంది. రానున్న జనవరి నుంచి సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిషన్‌భగీరథ విభాగం గణాంకాల ప్రకారం జిల్లాలో మొత్తం 912 గ్రామాలు, నివాసిత ప్రాంతాలున్నాయి. వీటికి వివిధ పథకాల

ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు.

వర్షాలు లేకపోవడంతో..

మంజీరా క్యాచ్‌మెంట్‌ ఏరియాలో సరైన వర్షాలు కురవకపోవడంతో నదిలో నీటి ప్రవాహం చాలా మట్టుకు తగ్గిపోయింది. ఉధృతంగా ప్రవహించాల్సిన ఈ నది చాలాచోట్ల వెలవెలబోతోంది. దీంతో సింగూరుకు ఆశించిన మేరకు నీరు చేరలేదు. దీంతో ఈ జలాశయం ఆధారంగా ఉన్న తాగునీటి పథకాల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు డబ్ల్యూటీపీలో పలు సాంకేతిక సమస్యలు కూడా తరచూ తలెత్తుతున్నాయి. దీంతో నీటి పంపింగ్‌కు ఇబ్బందులు వస్తున్నాయి. ఆయా తాగునీటి పథకాల పరిధిలో ఇప్పటి నుంచే తాగునీటి సమస్య తలెత్తుతోంది. రానున్న మార్చి, ఏప్రిల్‌, మే మాసాల్లో తాగునీటి సమస్యల మరింత జఠిలమయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement