● నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం
● తీరనున్న పదేళ్ల ప్రజల కష్టాలు
అల్లాదుర్గం(మెదక్): అడుగడుగునా గుంతలు, దెబ్బతిన్న రోడ్లతో పదేళ్లుగా నరకం చూసిన ప్రజలు, వాహనాదారుల ఇబ్బందులు త్వరలో తీరనున్నాయి. అందోల్ నియోజకవర్గంలోని రహదారుల నిర్మాణానికి జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ కృషితో నిధులు మంజూరయ్యాయి. దీంతో వడివడిగా పనులు సాగుతున్నాయి. మండలంలోని గడిపెద్దాపూర్ రోడ్డు, అల్లాదుర్గం నుంచి వెంకట్రావుపేట మీదుగా జగిర్యాల చౌరస్తా వరకు, అల్లాదుర్గం ఐబీ చౌరస్తా నుంచి వట్‌పల్లి మీదుగా రాయికోడ్, జహీరాబద్ వెళ్లే రోడ్లు అధ్వానంగా మారాయి. దీంతో వాహనాదారులు నిత్యం నరకం చూశారు. ఎన్నోసార్లు అందోళనలు చేసినా, వారి బాధలు మాత్రం తీర లేదు. ఈక్రమంలోనే రోడ్ల నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 161 జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు నుంచి గడిపెద్దాపూర్‌కు వెళ్లే రోడ్డు నిర్మాణానికి రూ. 95 లక్షలు మంజూరు చేసింది. అల్లాదుర్గం పోచమ్మగుడి నుంచి వెంకట్రావుపేట మీదుగా జగిర్యాల చౌరస్తా వరకు రూ.7.20 కోట్లు, అల్లాదుర్గం ఐబీ చౌరాస్తా నుంచి వట్‌పల్లి, రాయికోడ్ మీదుగా గంగ్వార్ వరకు ఆర్‌అండ్‌బీ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ.211 కోట్లు మంజూరు చేసింది.
పనులు ప్రారంభం
గడి పెద్దాపూర్ నుంచి 161 రహదారి వరకు రోడ్డు నిర్మాణానికి రూ. 95 లక్షలు మంజూరు కావడంతో పనులు ప్రారంభమయ్యయి. గ్రామంలో మెటల్, సీసీ రోడ్డు పనులు చేపడుతున్నారు. నాలుగు రోజుల్లో సీసీ రోడ్డు పనులు పూర్తవుతాయని కాంట్రాక్టర్ చెప్పారు. వర్షాలు కురుస్తుండటంతో బీటీ వేయడానికి ఇబ్బందిగా మారుతుందన్నారు.


