●జిల్లాలో ప్రమాదకరంగా శిథిల భవనాలు ●ఎప్పుడు కూలుతాయోనన్న ఆందోళన ●4 మున్సిపాలిటీల్లో 274 మందికి నోటీసులు
దశాబ్దాల క్రితం నిర్మించిన భవనాలు ప్రస్తుతం శిథిలావస్థకు చేరాయి. పెచ్చులూడి ఇనుప చువ్వలు తేలి ప్రమాదకరంగా మారాయి. వర్షాలు కురుస్తుండటంతో ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి. వాటిని గుర్తించిన అధికారులు వెంటనే వాటిని తొలగించాలని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 274 మందికి నోటీసులు జూరీ చేశారు. అయినా ఇప్పటివరకు స్పందన కరువైంది. – మెదక్‌జోన్
జిల్లాలో మెదక్, నర్సాపూర్, రామాయంపేట, తూప్రాన్ నాలుగు మున్సిపాలిటీలుండగా, వీటి పరిధిలో 274 శిథిల భవనాలను అధికారులు గుర్తించి యజమానులకు నోటీస్‌లు జారీ చేశారు. అందులో చాలా వరకు అద్దె భవనాలుండగా, మరికొన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ భవనాలు ఉన్నాయి. ఇవి దశాబ్దాల క్రితం నిర్మించినవి కావటంతో పూర్తిగా శిథిలావస్థకు చేసి ప్రమాదకరంగా మారాయి. వాటిని కూల్చివేయాలని నోటీసులో పేర్కొన్నారు. అందులో అత్యధికంగా రామాయంపేట బల్దియాలో 121 మందికి నోటీసులు జారీ చేయగా, రెండో స్థానంలో మెదక్ 107, నర్సాపూర్‌లో 30, తూప్రాన్‌లో 16 మంది చొప్పున మొత్తం 274 మందికి అందజేశారు. మెదక్ పట్టణంలో 8 ప్రభుత్వ కార్యాలయాలుండగా, సుమారు 62 మున్సిపల్ కాంప్లెక్స్ భవనాలతో పాటు మిగితా 37 ప్రైవేట్ ఇళ్లు ఉన్నాయి. మిగితా 3 మున్సిపాలిటీల్లో అత్యధికంగా ప్రైవేట్ భవనాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిలో చాలా వరకు పెచ్చులూడి పడుతున్నవే అధికంగా ఉన్నాయి. వాటిలో కొన్నింటికి మరమ్మతులు చేసి నెట్టుకొస్తున్నారు.
కోర్టును ఆశ్రయించిన వ్యాపారులు
మెదక్ మున్సిపాలిటీకి చెందినవి 60కి పైగా కాంప్లెక్స్ (భవనాలను)లను వ్యాపారులకు అద్దెకు ఇచ్చారు. అవి శిథిలావస్థకు చేరాయని, వాటిని వెంటనే ఖాళీ చేయాలని, వాటిని తొలగించి నూతన భవనాలు నిర్మిస్తామని మున్సిపల్ అధికా రులు నాలుగేళ్ల కిత్రం నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. షాపులను ఖాళీ చేశాక నిర్మాణాలు చేపట్టకుంటే తాము రోడ్ల మీదకు వస్తామని, నూతన కాంప్లెక్స్ భవన నిర్మాణం కోసం ప్రభుత్వం నుంచి నిధులు మంజూరయ్యాకనే ఖాళీ చేస్తామంటూ వారు ఏకంగా హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. ఇది వరకు పట్టణంలోని మార్కెట్‌లో ఇదే విధంగా కొంత మంది చేత షాపులు ఖాళీ చేయించి భవనాలను తొలగించారు. అయితే మూడేళ్లు గడిచినా, వాటి స్థానంలో నూతన షాపులు నిర్మించటం లేదని అద్దె నిర్వాహకులు చెబుతున్నారు. శిథిలావస్థకు చేరిన భవ నాల్లో జరగరాని ప్రమాదం ఏదైనా ఎవరు బాధ్యులనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.
నోటీసులిచ్చినా స్పందన కరువు
భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని శిథిలావస్థకు చేరిన పాఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలను వెంటనే ఖాళీ చేయాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆదేశాలు జారీ చేశారు. కానీ ఎవరూ స్పందించటం లేదని అధికారులు చెబుతున్నారు. వర్షాలకు భవనాలు తడిసి కుప్పకూలి పోయే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ప్రమాదం జరగకముందే జాగ్రత్తలు తీసుకోవటం ఉత్తమమని సూచిస్తున్నారు.


