పెద్దశంకరంపేట(మెదక్): అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే గ్రామాలు అభివృద్ధిలో ముందుకు సాగుతాయని డీపీఓ యాదయ్య అన్నారు. మంగళవారం పెద్దశంకరంపేటలో కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతం చేయాలని, నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలన్నారు. అనంతరం పంచాయతీలో నెలకొన్న సమస్యలపై విచారణ చేపట్టి రికార్డులు పరిశీలించారు. కార్యక్రమంలో డీఎల్‌పీఓ సాయిబాబ, సర్పంచ్ జంగం రేణుక, ఎంపీడీఓ క్రాంతికుమార్, ఎంపీఓ జాకీర్‌హుస్సేన్, ఏపీఓ సంతోష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మెదక్ కలెక్టరేట్: రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలో రెగ్యులర్ బస్సులతో పాటు మరో 204 ప్రత్యేక బస్సులు నడిపించనున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ విజయ భాస్కర్ తెలిపారు. మంగళవారం రాత్రి మెదక్ ఆర్టీసీ డిపోను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా డిపో కార్యాలయంతో పాటు గ్యారేజ్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈనెల 26 నుంచి 31 వరకు 6 రోజులపాటు ప్రత్యేక బస్సులు నడుస్తాయని తెలిపారు. అయితే ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అధికంగా చార్జ్ ఉంటుందని, మహిళలకు మాత్రం ఉచితమేనని తెలిపారు. నర్సాపూర్ ఆర్టీసీ డిపోకు కొత్త మేనేజర్‌ను త్వరలో నియమిస్తామని చెప్పారు.
నిజాంపేట(మెదక్): మండల పరిధిలోని నార్లాపూర్‌లో పంచాయతీ పాలకవర్గం, యువత సంయుక్తంగా బెల్టు షాపుల ద్వారా జరుగుతున్న మద్యం అమ్మకాలపై నిషేధానికి నడుం బిగించారు. ఈమేరకు మంగళవారం గ్రామంలో సంతకాల సేకరణ చేపట్టారు. గ్రామంలో విచ్చలవిడిగా అమ్ముతున్న మద్యం కారణంగా యువత చెడు మార్గంలో పయనిస్తూ, వ్యసనాలకు బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈక్రమంలో బెల్టు షాపుల యజమానులకు నోటీసులు జారీ చేశారు. కా ర్యక్రమంలో ఉప సర్పంచ్ చంద్రం, ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు జగన్, వార్డు సభ్యులు మధు, రవి, నరేష్, శ్రీనుతో పాటు యువకులు ప్రవీణ్, నాగరాజు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
మెదక్ కలెక్టరేట్: పట్టణంలోని వెస్లీ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో మంగళవారం ఉమ్మడి జిల్లా జూనియర్ బాలికల ఫుట్‌బాల్ జట్టు ఎంపిక నిర్వహించారు. జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో మెదక్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన సుమారు 70 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ ఎంపికై న 18 మంది క్రీడాకారులతో జిల్లా జట్టును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 4 నుంచి 6వరకు నిజామాబాద్‌లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో పాల్గొనేలా సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.


