● అసంపూర్తిగా డబుల్ బెడ్రూం ఇళ్లు
● అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్న వైనం
హత్నూర(సంగారెడ్డి): నిరుపేదలకు గూడు నిర్మించి ఇవ్వాలన్న లక్ష్యంతో చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్లు ఏళ్ల తరబడి అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయి. పనులు పూర్తి చేసి పేదలకు అందజేయాలన్న ఆలోచన అధికారులకు సైతం రావడం లేదు. దీంతో రూ. లక్షలు వెచ్చించి అసంపూర్తిగా వదిలేయడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. మండల కేంద్రంలోని హత్నూరలో గత ప్రభుత్వ హయాంలో ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూంలు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించారు. అందులో భాగంగా హత్నూరలో ఇల్లు లేని నిరుపేదలు 32 మందిని గుర్తించి వారి కోసం కొన్యాలకు వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. అయితే అవి ఏళ్లుగా పూర్తికాకుండా అసంపూర్తిగా నిలిచిపోయా యి. నిర్మించిన వాటికే డబ్బులు ఇవ్వలేదని కాంట్రాక్టర్ మధ్యలోనే పనులు నిలిపివేశారు. ఈక్రమంలోనే ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లూ గడిచిపోయింది. కొత్తగా శ్రీకారం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. పలువురికి ఇండ్లు సైతం మంజూరు చేయగా, నిర్మాణాలు సైతం చేపడుతున్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూంల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇప్పటికై నా వాటిని పూర్తిస్థాయిలో నిర్మించి అందజేయాలని పేదలు కోరుతున్నారు. ఇదే విషయమై ఏఈ రమ్యను వివరణ కోరగా.. హత్నూరలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్ల విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. భవనాలను పూర్తి చేసి రెండో విడతలో స్థలం లేని నిరుపేదలకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.


