1.18 లక్షల ఓటర్లకు
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)కు సంబంధించి మలిదశ ప్రక్రియ షురూ అయింది. మ్యాపింగ్ కానీ వారితో పాటు అనామలిస్ జాబితాలో చేరిన ఓటర్లకు నోటీసుల జారీ ప్రారంభించారు. నోటీసులు అందుకున్న వారు ఆధారాలు చూపడంతో పాటు ఈనెల 27 నుంచి డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. వచ్చే నెల 20న ఈ ప్రక్రియ ముగియనుంది. అక్టోబర్ 19న ఓటర్ తుది జాబితా విడుదల కానుంది. – మెదక్‌జోన్
జిల్లాలో మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలు ఉన్నాయి. ‘సర్’కు ముందు ఈ రెండు నియోజకవర్గాల్లో 4,53,140 మంది ఓటర్లు ఉండగా.. ప్రక్రియ అనంతరం ఆ సంఖ్య 4,10,204కు తగ్గింది. అనగా 42,936 మంది ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫారాలను తిరిగి బీఎల్‌ఓలకు ఇవ్వలేదు. ఇందులో డబుల్ ఓటర్లతో పాటు చనిపోయిన వారు, శాశ్వతంగా అడ్రస్ మారిన వారు ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి ఇచ్చిన ఓటర్లలో 1,18,661 మంది ఓటర్ల పేర్లు సరిగా లేకపోవడంతో పాటు ఇంటి పేరు, తండ్రి, లేక భర్త పేర్లు తప్పుగా ఉండటం, వయసులో తేడా.. తదితర సమస్యలు ఉన్న ఓటర్లను (అనామలిస్) జాబితాలో చేర్చారు. అలాగే పాతికేళ్ల క్రితం వేసిన ఓటు, ప్రస్తుత ఓటు (మ్యాపింగ్)కు సంబంధించి తగిన ఆధారాలు చూపని వారు, 2002లో ఎక్కడ ఓటు ఉంది.. తల్లిదండ్రులకు సంబంధించిన వివరాలు ఇవ్వకుండా ఎన్యూమరేషన్ ఫారాన్ని నామమాత్రంగా నింపి బీఎల్‌ఓలకు అప్పగించిన వారిని (మ్యాపింగ్) విభాగంలో చేర్చారు. ఈ రెండింటికి సంబంధించి రెండు నియోజకవర్గాల్లో 1,18,661 మందికి నోటీసులు జారీ చేస్తున్నారు. వీరు ప్రభుత్వం జారీ చేపినా 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి సంబంధిత అధికారులకు చూయించి సరి చేసుకోవాలి. అలాగే ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియలో భాగంగా 2002లో ఓటు హక్కు ఉందా..? అప్పుడు ఓటు వేసినట్లు అయితే తల్లిదండ్రి ఓటరు సీరియల్ నంబర్‌ను వివరించాల్సి ఉంటుంది. నూతనంగా ఓటు వచ్చినా తన తల్లిదండ్రులు, లేదా భర్తకు సంబంధించిన వివరాలను ఆధారాలతో సహా చూపించాలి. అన్ని సక్రమంగా ఉంటే డిక్లరేషన్ ఫాంను అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. కాగా ఈ ప్రక్రియ ఈ నెల 27 నుంచి జిల్లాలో ప్రారంభమవుతుందని అధికారులు చెబుతున్నారు.
అనామలిస్, మ్యాపింగ్ కాని వారికి అందజేత
27 నుంచి ఆధారాలు సమర్పించాలి
సెప్టెంబర్ 20న ముగియనున్న ప్రక్రియ
అక్టోబర్ 19న తుది ఓటరు జాబితా
నర్సాపూర్‌లో అధికం
జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో అనామలిస్, మ్యాపింగ్‌లో 1,18,661 ఓటర్లకు నోటీసులు ఇస్తున్నారు. ఇందులో నర్సాపూర్‌లో 61,124 మంది ఓటర్లు ఉండగా, మెదక్ నియోజకవర్గంలో 57,537 మందికి నోటీసులు జారీ చేస్తున్నారు.


