పెద్దశంకరంపేట(మెదక్): మండలంలో ఆదివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులన్నీ చిత్తడిగా మారాయి. గత కొన్ని రోజులుగా వర్షాలు లేక తీవ్ర ఆందోళనలో ఉన్న రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వర్షానికి చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.
నర్సాపూర్: రైతులు అవసరం మేర యూరియా కొనాలని వ్యవసాయ శాఖ ఏడీ సంధ్యారాణి కోరారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ.. కొంతమంది రైతులు ప్రస్తుత అవసరాలకు మించి యూరియాను కొనుగోలు చేస్తున్నట్లు తమకు సమాచారం ఉందని, అదనంగా కొనుగోలు చేయడంతో తాత్కాలిక ఇబ్బందులు వస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు. ఈనెల 7వ తేదీ నుంచి అమలు చేసిన ఎరువుల బుకింగ్ యాప్‌లో పలు సాంకేతిక సమస్యలు తలెత్తాయని, వాటితో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను తాము జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. తాజాగా డివిజన్ స్థాయిలో ఎరువులు కొనుగోలు చేసే విధంగా యాప్‌లో మార్పులు చేశారని, ఇకపై ఎలాంటి ఇబ్బందులు రాకపోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులకు సరిపడా యూరియా తెప్పించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని వివరించారు.
వెల్దుర్తి(తూప్రాన్): మండలంలోని దామరాంచలో ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి రాజిరెడ్డి ఆదివారం పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రధాన లక్ష్యమని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ నాగమణి, డీసీసీ ఉపాధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, నాయకులు మల్లేశం, విఠల్‌గౌడ్ పాల్గొన్నారు.
హవేళిఘణాపూర్(మెదక్): విద్యుదాఘాతంతో ఓ యువరైతు మృతి చెందిన ఘటన హవేళిఘణాపూర్ మండలం గంగాపూర్ తండాలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. గంగాపూర్ తండాకు చెందిన ముడావత్ గోపాల్(28) ఆదివారం ఉదయం పొలం వద్దకు వెళ్లాడు. ఎంతకూ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా అప్పటికే కరెంటు షాక్ తగిలి మృతి చెంది ఉన్నట్లు కుటుంబీకులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. స్టాటర్ డబ్బాలోకి కరెంటు సరఫరా కాకపోవడంతో మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడన్నారు. మృతునికి భార్య రజిత, కుమారుడు ఉన్నాడు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు హవేళిఘణాపూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రోస్టర్ విధానం
రద్దు చేయాల్సిందే
దుబ్బాక: రోస్టర్ విధానం వల్ల మాలలకు తీరని అన్యాయం జరుగుతుందని, రిజర్వేషన్లను పునఃరుద్ధరించాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి సుద్దాల దేవయ్య డిమాండ్ చేశారు. ఆదివారం దుబ్బాకలో హాలో మాల.. చలో దుబ్బాక కార్యక్రమం నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. ఈ నెల 31న నిర్వహించతలపెట్టిన రాష్ట్ర సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమానికి మాలలు భారీగా తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జాతీయ మాల మహానాడు దుబ్బాక నియోజకవర్గ ఇన్‌చార్జి కాల్వ నరేష్, రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యుడు ర్యాకం శ్రీరాములు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


