● అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
● 80వ స్వాతంత్య్ర వేడుకల్లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్
మెదక్‌జోన్: అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రైజింగ్–2047 విజన్‌తో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెడతామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ పేర్కొన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం మెదక్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. తాఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఓ వైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ తెలంగాణను విశ్వవేదికపై సగర్వంగా నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు. భూ భారతి ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చట్టాన్ని అమలు చేస్తున్నామన్నారు.
ఎల్‌నినో కారణంగా..!
ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షపాతం తక్కువ నమోదయ్యే అవకాశం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా వరికి బదులుగా ఆరుతడి పంటలు వేయాలని సూచించిందని, ఇందులోభాగంగా జిల్లాలో వరికి బదులుగా 28,933 ఎకరాల్లో ఆరుతడి పంటలను సాగు చేస్తున్నట్లు తెలిపారు.
స్మార్ట్ రేషన్‌కార్డుల పంపిణీ
రాష్ట్రంలో స్మార్ట్‌రేషన్ కార్డులను పంపిణీ చేస్తోందని మంత్రి చెప్పారు. జిల్లాలో ఇప్పటికే 2,41,393 రేషన్‌కార్డులను స్మార్ట్‌కార్డులతో పాటు నూతనంగా 28,582 కార్డులను ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
ఇల్లులేని ప్రతీ కుటుంబానికి...!
రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల సబ్సిడీతో పక్కాగృహాన్ని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందులోభాగంగా జిల్లాలో మొదటి విడత కింద రూ.447.75 కోట్ల బడ్జెట్‌తో 8,955 ఇళ్లను మంజూరు చేశామని చెప్పారు. 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల పథకం కూడా ప్రారంభించుకున్నామని మంత్రి వివరించారు.
విద్యకు పెద్దపీట...!
జిల్లాలో 2026–27 విద్యా సంవత్సరంలో 905 ప్రభుత్వ పాఠశాలల్లో 72,896 విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని మంత్రి తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ (టీపీఎస్) ను ఏర్పాటు చేస్తోందని, జిల్లాలోని రామాయంపేటలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను 20 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్ల వ్యయంతో నిర్మిస్తూ 2,500 మంది విద్యార్థులకు వసతి కల్పించే సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ప్రస్తుతం జిల్లాలో 120 ప్రాథమిక పాఠశాల్లో 1,417 విద్యార్థులకు ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహించబడుతున్నాయని 16 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు మరమ్మతు నిమిత్తం రూ.3.26 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సులు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రైతుకు సాగుపెట్టుబడి కోసం ఎకరాకు రూ.6 వేలు ఇస్తున్నామని చెప్పారు. ఇటీవల ఏడుపాయల వనదుర్గామాత ఆలయానికి రూ.7 కోట్లు, ఖిల్లా అభివృద్ధికి రూ.57 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి వివరించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రోహిత్‌రావు, కలెక్టర్ ప్రతిమాసింగ్, ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ విక్రాంత్‌కుమార్‌సింగ్, మున్సిపల్ చైర్మన్ కానుగ రాధిక, వైస్ చైర్మన్ నరేశ్‌గౌడ్‌తోపాటు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
జెండాను ఆవిష్కరిస్తున్న మంత్రి వివేక్ (ఇన్ సెట్‌లో మాట్లాడుతున్న మంత్రి)
నృత్యం చేస్తున్న విద్యార్థులు


