అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు | - | Sakshi
Sakshi News home page

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

Aug 16 2026 8:26 AM | Updated on Aug 16 2026 8:26 AM

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

మెదక్‌ కలెక్టరేట్‌: మెదక్‌ జిల్లా పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో శనివారం భారత స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహించారు. కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో భాగంగా పలు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా పట్టణంలోని గీతా స్కూల్‌, సిద్ధార్థ్‌ స్కూల్‌, డాన్‌ బాస్కో స్కూల్‌, కేజీబీవీ, గురుకుల బాలికల పాఠశాలల విద్యార్థులతోపాటు నివేదిత నృత్య కళాశాల విద్యార్థులు దేశభక్తి, సంస్కృతి సంప్రదాయాలను ఉట్టిపడేలా ప్రదర్శించిన దేశభక్తి నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ నృత్య ప్రదర్శనలను తిలకించిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి గడ్డం వివేక్‌, కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌, జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, ఎమ్మెల్యే రోహిత్‌రావు విద్యార్థులను అభినందించి జ్ఞాపికలను అందజేశారు.

మొక్కుబడిగా వేడుకలు

సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కార్యక్రమం ఉండటంతో జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకలు మొక్కుబడిగా జరిగాయన్న విమర్శలు వెల్లువెత్తాయి. వేడుకల్లో ఆయా శాఖల అభివృద్ధి పథకాల శకటాలు కనిపించలేదు. ఫైర్‌ సిబ్బంది విన్యాసాలు వేడుకల్లో ఎక్కడా కానరాలేదు. కేవలం ఆరు శాఖల ఆధ్వర్యంలో స్టాళ్లను ఏర్పాటు చేశారు. విద్యార్థులు నిర్వహిస్తున్న సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు మధ్యలో నిలిపివేసి వివిధ శాఖల అధికారులకు సేవా పురస్కారాలు అందించారు. దీంతో రెండు పాఠశాలల విద్యార్థులు ఎండలోనే కూర్చొని ఇబ్బందులు పడ్డారు. అనంతరం కొంతమందికి పురస్కారాలు, విద్యార్థులకు జ్ఞాపికలను అందజేశారు. అనంతరం మంత్రి వివేక్‌ , ఎమ్మెల్యే రోహిత్‌రావు, కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌, ఎస్పీ డీవీ శ్రీనివాసరావులు సంగారెడ్డికి వెళ్లిపోయారు. దీంతో వేడుకల ప్రాంగణం ఖాళీ అయ్యింది. అనంతరం నృత్య ప్రదర్శనలు నిర్వహించిన రెండు పాఠశాలల విద్యార్థులకు సరైన ప్రోత్సాహం లేక ఇబ్బందులకు గురయ్యారు. డీఆర్డీఓ, డీడబ్ల్యూఓ, వైద్య ఆరోగ్యశాఖ, మెప్మా, హౌసింగ్‌, వ్యవసాయ, ఉద్యానవన శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను అదనపు ఎస్పీ విక్రాంత్‌ కుమార్‌సింగ్‌, డీఆర్‌ ఓ అంబదాస్‌ రాజేశ్వర్లు సందర్శించి పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement