సీఎం పర్యటన ఇలా..
సీఎం సారు..
కార్యరూపం దాల్చని మెట్రో పొడిగింపు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం సంగారెడ్డికి రానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా జారీ చేస్తున్న స్మార్ట్‌రేషన్‌కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేసి.. ఈ కార్యక్రమాన్ని లంచనంగా ప్రారంభించేందుకు జిల్లాకు వస్తున్నారు. సీఎం పర్యటనపై జిల్లా వాసులు అనేక ఆశలు పెట్టుకున్నారు. పారిశ్రామిక రంగంలో అభివృద్ధిలో ఉన్న జిల్లాలో ప్రధాన సమస్యలు ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోవడం లేదు. సీఎం తన పర్యటనలో ఈ ప్రధాన సమస్యలు పరిష్కరమయ్యేలా చొరువ చూపాలని జిల్లా వాసులు కోరుకుంటున్నారు. ప్రధానంగా సాగునీరు, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలపై సీఎం స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరుతున్నారు.
● సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో 3.84 లక్షల ఎకరాలకు సాగులోకి తెచ్చేందుకు గత ప్రభుత్వ హయాంలో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపనలు జరిగాయి. నిధుల సమస్య కారణంగా అప్పట్లో ఈ పనులు పట్టాలెక్కలేదు. ఈ ప్రభుత్వ హాయాంలో ఈ పథకాల ఊసే లేకుండా పోయింది. ఈ పనులు ప్రారంభించేందుకు చొరువ చూపాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హైదరాబాద్ జంట నగరాలకు తాగునీరు, సంగారెడ్డి, మెదక్ జిల్లాకు సాగునీరు అందిస్తున్న సింగూరు ప్రాజెక్టు మరమ్మత్తు పనులు వీలైనంత త్వరగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే కాలువల ఆధునీకరణ పనులు కూడా వేగవంతం అయ్యేలా చూడాలని కోరుతున్నారు.
● మెట్రోరైలును పటాన్‌చెరు వరకు పొడిగించే ప్రతిపాదన ఇంకా కార్యరూపం దాల్చడం లేదు. మియాపూర్ – పటాన్‌చెరు కారిడార్ ఫేజ్–2 (ఏ) 13.4 కి.మీల పొడిగింపునకు సంబంధించిన డీపీఆర్ కేంద్రానికి వెళ్లింది. కేంద్రం నుంచి అనుమతుల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరువ చూపి.. పనులు ప్రారంభిస్తే జిల్లాకు మేలు జరుగుతుంది. సంగారెడ్డి నుంచి నిత్యం వేలాది మంది హైదరాబాద్‌కు వెళ్లి వస్తూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ రైలును సంగారెడ్డి వరకు పొడగించాలనే డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది.
● సంగారెడ్డి – మదీనాగూడ వరకు ముంబై హైవే విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. 29.35 కి.మీలు నాలుగు లేన్ల నుంచి ఆరు లేన్లుగా విస్తరించేందుకు రూ.1,297 కోట్లతో పనులు చేపట్టారు. ఈ పనులు నత్తనడకన సాగడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. జూలైలోనే ఈ పనులు పూర్తి కావాలి. కానీ ఇంకా సగం కూడా పూర్తి కాలేదు. ఈ పనులు వేగవంతం అయ్యేలా సంబందిత శాఖల అధికారులకు సీఎం ప్రత్యేక ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నత్తనడకన ముంబై హైవే విస్తరణ పనులు
ఊసే లేని సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలు
కాలుష్య కారక పరిశ్రమలతో ప్రజలు విలవిల..
నేడు జిల్లాకు సీఎం రేవంత్‌రెడ్డి రాక
సంగారెడ్డి: సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన వివరాలిలా ఉన్నాయి. శనివారం మధ్యాహ్నం 1:30 నిమిషాలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో బయలుదేరనున్నారు. రెండు గంటలకు కంది ఐఐటీలో హెలిప్యాడ్‌లో దిగి రోడ్డు మార్గం ద్వారా 2:15 నిమిషాలకు అంబేడ్కర్ స్టేడియం గ్రౌండ్‌కు చేరుకుంటారు. మొదట మంత్రి దామోదర రాజనర్సింహ ప్రసంగం చేయనున్నారు. 2:35 నిమిషాలకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి గడ్డం వివేక్ ప్రసంగిస్తారు. 2:40కి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడతారు. 2:50 నుంచి 3:30 వరకు సీఎం ప్రసంగాన్ని కొనసాగిస్తారు. అనంతరం స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందించనున్నారు. 3:50 నిమిషాలకు ఐఐటీ చేరుకొని తిరిగి హైదరాబాద్‌కు వెళ్తారు.


