పునఃసర్వేకు 20 మంది సర్వేయర్ల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

పునఃసర్వేకు 20 మంది సర్వేయర్ల ఎంపిక

Aug 15 2026 7:23 AM | Updated on Aug 15 2026 7:23 AM

పునఃసర్వేకు 20 మంది సర్వేయర్ల ఎంపిక యూరియా బుకింగ్‌ కష్టాలు రైతులు ఆందోళన చెందొద్దు

–కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌

మెదక్‌ కలెక్టరేట్‌: ప్రజలకు విశ్వసనీయమైన సర్వే సమాచారం అందించడమే లక్ష్యంగా పునఃసర్వే నిర్వహించాలని కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ లైసెన్స్‌ సర్వేయర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్‌ తన ఛాంబర్‌లో జిల్లాలో పునఃసర్వే కోసం శిక్షణ పూర్తి చేసిన 20 మంది అర్హులైన సర్వేయర్లకు లైసెన్సులను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కచ్చితమైన సర్వే సరిహద్దులను ఏర్పాటుకు, ప్రజలకు విశ్వసనీయమైన సర్వే సమాచారాన్ని అందించే లక్ష్యంతో పునఃసర్వే కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. లైసెన్స్‌ పొందిన సర్వే అభ్యర్థులు భూ రికార్డులశాఖ నిర్దేశించిన సాంకేతిక విధానాలు, నియమాలు, సూచనలు పాటించాలని ఆదేశించారు. అలాగే రెవెన్యూ, సర్వే శాఖ అధికారులకు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ల్యాండ్‌ సర్వే ఏడీ కిషన్‌, సంబంధిత ల్యాండ్‌ సర్వీస్‌ సిబ్బంది, లైసెన్‌న్స్‌ సర్వేయర్లు పాల్గొన్నారు.

● క్షణాల్లో అయిపోతున్న దుస్థితి

● ఆందోళన చెందుతున్న రైతన్నలు

చిన్నశంకరంపేట(మెదక్‌): యూరియా బుక్‌ చేసుకునేందుకు రైతన్నలు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని జంగరాయి గ్రామంలో శుక్రవారం యూరియా బుక్‌ చేసుకునేందుకు అన్నదాతలు పడుతున్న పాట్లు అంతాఇంతా కాదు. తీరా యాప్‌ ఓపెన్‌ అయిన నిమిషం లోపే 1790 బస్తాల యూరియా బుక్‌ అయి యాప్‌లో నిల్‌ చూపడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం చిన్నశంకరంపేట, జంగరాయి పీఏసీఎస్‌లకు 560 బస్తాల చొప్పున, గవ్వలపల్లిలోని శ్రీరామలింగమేశ్వర ఫర్టిలైజర్‌ షాప్‌కు 670 బస్తాల యూరియా వచ్చింది. ఉదయం 10 గంటలకు ప్రేమ్‌ వర్క్‌ ఫార్మర్‌ యాప్‌లో యూరియా బుక్‌ చేసుకోవాలని ఏఓ ప్రవీణ్‌కుమార్‌ ప్రకటించారు. అయితే యాప్‌ ఓపెన్‌ అయినా ఒక నిమిషంలోపే బస్తాలు అన్ని అయిపోయి యాప్‌లో నిల్‌ చూపడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. స్మార్ట్‌ ఫోన్‌ ఉపయోగించే యువకులే క్షణాల్లో యూరియా బుక్‌ చేసేందుకు ఆపసోపాలు పడుతున్నారు. ఇక ఉపయోగించడం రాని రైతులు రైతువేదికల వద్ద, ఫర్టిలైజర్‌ దుకాణాల వద్ద ఇతరుల సహాయం కోసం ఎదురు చూశారు.

అవసరం 38 వేలు.. వచ్చింది 13 వేలు

చిన్నశంకరంపేట మండలంలో 19 వేల ఎకరాల్లో వరి సాగు చేశారని, ఇందుకు 38 వేల యూరియా బస్తాలు అవసరమని ఏఓ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. అయితే ఇప్పటి వరకు 13 వేల యూరియా బస్తాలు మాత్రమే వచ్చాయని, త్వరలోనే మరిన్ని బస్తాలు వస్తాయని చెప్పారు. రైతులు ముందుగా ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని కోరారు.

● యూరియా నిల్వలు పుష్కలం

● జిల్లా వ్యవసాయ అధికారి దేవ్‌కుమార్‌

మెదక్‌ కలెక్టరేట్‌: జిల్లాలోని రైతులు యూరియా కోసం ఎలాంటి ఆందోళన చెందవద్దని, నిల్వలు పుష్కలంగా ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 2403 మెట్రిక్‌ టన్నుల నిల్వలు అందుబాటులో ఉన్నట్లు వివరించారు. మార్క్‌ఫెడ్‌ వద్ద 1855 మెట్రిక్‌ టన్నులు, రిటైలర్ల వద్ద 548 మెట్రిక్‌ టన్నులు ఉన్నాయని తెలిపారు. ఈనెల 7వ తేదీ నుంచి ఎఫ్‌ఎస్‌ఎస్‌ యాప్‌ ద్వారా యూరియా విక్రయిస్తున్నామని చెప్పారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ యాప్‌ ద్వారా బుక్‌ చేసుకున్న రైతులందరికి యూరియా అందజేయనున్నట్లు వెల్లడించారు. అలాగే ప్రతిరోజూ యూరియా స్టాక్‌ను అందుబాటులో ఉంచుతున్నామని వివరించారు. రిటైలర్‌ కేంద్రాల వద్ద ఉన్న వలంటీర్లు, రైతు వేదికల వద్ద ఉండే ఏఈఓలు రైతులకు యాప్‌ ద్వారా యూరియా బుకింగ్‌ చేసే విధానంపై అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. రైతులకు బుకింగ్‌ చేయడంలో సహాయం అందిస్తూ, వారి సమస్యలను పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement