సహకారంలో సందడి | - | Sakshi
Sakshi News home page

సహకారంలో సందడి

Aug 9 2026 8:47 AM | Updated on Aug 9 2026 8:47 AM

సహకార సంఘాల్లో సందడి షురూవైంది. పీఏసీఎస్‌ (సహకార సంఘాలు) పాలకవర్గాలకు పదవులు ఆశిస్తున్న అధికార కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సభ్యత్వాలు లేని నాయకులు ఆయా పీఏసీఎస్‌లలో కొత్తగా సభ్యత్వాలు తీసుకుంటున్నారు. సాక్షిప్రతినిధి, సంగారెడ్డి :

ఈ పదవులు రావాలంటే ఆయా సహకార సంఘాల్లో సభ్యత్వం తప్పనిసరి

లేని వారు కొత్తగా సభ్యత్వం తీసుకుంటున్న ఆశావహులు

డీసీసీబీ, డీసీఎంఎస్‌ పదవుల కోసమూ కొందరు నేతల ప్రయత్నాలు

పీఏసీఎస్‌ చైర్మన్‌ డైరెక్టర్‌ పదవులపై కాంగ్రెస్‌ నేతల గురి

సభ్యత్వం ఉంటేనే చైర్మన్‌, డైరెక్టర్‌ పదవులకు అర్హత కావడంతో లేనివారు కొత్తగా సభ్యత్వాలు చేసుకుంటున్నారు. అవసరమైతే ఆయా పీఏసీఎస్‌ల పరిధిలో వ్యవసాయ భూమి లేకపోతే..కొనుగోలు చేసి మరీ సభ్యత్వాలు తీసుకుంటున్నారు. పీఏసీఎస్‌ పరిధిలోని గ్రామాల్లో తప్పనిసరిగా భూమి ఉండాల్సి ఉండటంతో ఈ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మొత్తం 105 పీఏసీఎస్‌లున్నాయి. ఇందులో సంగారెడ్డి జిల్లాలో 54 ఉండగా, మెదక్‌లో 36, సిద్దిపేట 15 సంఘాలున్నాయి. సిద్దిపేట జిల్లాలో కొన్ని సంఘాలు ఇతర జిల్లాల డీసీసీబీ పరిధిలో ఉన్నాయి. కేవలం 15 మాత్రమే ఉమ్మడి జిల్లా డీసీసీబీ పరిధిలో కొనసాగుతున్నాయి. ఒక్కో పీఏసీఎస్‌కు చైర్మన్‌తోపాటు, 13 మంది డైరెక్టర్‌ పోస్టులు ఉంటాయి. ఈ పోస్టులను ప్రభుత్వం నామినేట్‌ చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నాయకులు ఈ పదవులపై గురి పెట్టారు.

ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న పీఏసీఎస్‌లకు సంబంధించిన ఈ పోస్టులకు నామినేట్‌ చేయాల్సిన వారి పేర్లను స్థానిక ఎమ్మెల్యేలు ప్రతిపాదనలు ఆశాఖ మంత్రి వద్దకు పంపినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు లేని చోట్ల నియోజకవర్గ ఇన్‌చార్జిలు ఈ పదవులు ఎవరికి ఇవ్వాలనే పేర్లను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఇన్‌చార్జి మంత్రి ద్వారా ఈ ప్రతిపాదనలు వెళ్లినట్లు సమాచారం. కాగా పీఏసీఎస్‌ల పాలకవర్గాల పదవీకాలం 2025 జనవరిలోనే ముగిసిన విషయం విదితమే. అప్పటి నుంచి అన్ని పీఏసీఎస్‌లకు సంబంధిత అధికారులు పర్సన్‌ ఇన్‌చార్జిలుగా కొనసాగుతున్నారు.

జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ (డీసీఎంఎస్‌)లను మార్క్‌ఫెడ్‌లో విలీనం చేయాలని ప్రభుత్వం చాలారోజుల క్రితమే నిర్ణయం తీసుకుంది. కానీ, ఇంతవరకు దానికి సంబంధించిన జీఓ రాలేదు. ఈ డీసీఎంఎస్‌ చైర్మన్‌, పాలకవర్గం పదవులను కూడా నామినేట్‌ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ పదవి రేసులో జహీరాబాద్‌కు చెందిన అధికార పార్టీ నాయకుడి పేరు వినిపిస్తోంది. అలాగే అందోల్‌ నియోజకవర్గానికి చెందిన మరో నాయకుడు కూడా ఈ పదవిని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పదవి కోసం ఆయన యూ.ఎస్‌. నుంచి తిరిగి వచ్చినట్లు అధికార పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తం మీద సహకార సంఘాల్లో నామినేటెడ్‌ సందడి అంతర్గతంగా కొనసాగుతోంది.

మరోవైపు ఈ పదవుల విషయంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులు విచారణలో ఉన్నప్పటికీ అధికార పార్టీలో మాత్రం ఈ పదవులపై ఆశలు పెట్టుకున్న నాయకులు తమ ప్రయత్నాలను కొనసాగిస్తుండటం ఆసక్తికరంగా మారింది.

పర్సన్‌ ఇన్‌చార్జిలుగా ఉన్న సమయంలో కొత్త సభ్యత్వాలు తీసుకుంటే అవి చెల్లవని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. పర్సన్‌ ఇన్‌చార్జిలు కేవలం ఆయా సంఘాల కార్యకలాపాలు కొనసాగించేందుకు తాత్కాలికంగా ఉంటారని చెబుతున్నారు. ఈ పర్సన్‌ ఇన్‌చార్జిలకు ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అధికారం సహకార చట్టంలో లేదని పేర్కొంటున్నారు. ప్రధానంగా సభ్యత్వాలు ఇచ్చే అధికారం పర్సన్‌ ఇన్‌చార్జిలకు ఉండదని అంటున్నారు.

జిల్లా కేంద్రం సహకారం బ్యాంకు (డీసీసీబీ) పాలక వర్గం పదవులపైనా నేతలు గురి పెట్టారు. గజ్వేల్‌ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు నాయకులు డీసీసీబీ చైర్మన్‌ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు డీసీసీబీ చైర్మన్‌గా పని చేసిన చిట్టి దేవెందర్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన కూడా ఈ పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement