కొల్చారం(నర్సాపూర్): వడ్డెరల ఉపాధికి ప్రభుత్వం చట్టపరమైన అనుమతి ఇవ్వాలని మెదక్ జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షుడు దండుగుల దుర్గ సాయిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని పోతంశెట్టిపల్లి చౌరస్తాలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో మండల అధ్యక్షుడు ఓర్స ఈశ్వర్ అధ్యక్షతన శనివారం జిల్లా వడ్డెరల సమావేశం నిర్వహించారు. సమావేశంలో సాయిలు మాట్లాడుతూ తమ తాతల కాలం నుంచి తండ్రుల వరకు, ప్రస్తుతం తమ కుటుంబాలు కూడా రాళ్లు కొట్టి జీవనం సాగిస్తున్నాయన్నారు. ప్రస్తుతం రాయి కొట్టే వృత్తికి అడ్డంకులు ఏర్పడటంతో వడ్డెర కుటుంబాలు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. గత రెండేళ్లుగా ప్రతీ మండలంలో అటవీశాఖ అధికారులు రాళ్లు కొట్టే తమ సంప్రదాయ వృత్తిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి తమ వడ్డెరల సమస్యలను ప్రత్యేకంగా పరిగణించి జీవనోపాధి కోసం అడవుల్లో ఉన్న అనుమతించదగిన బండలపై రాయి కొట్టుకునేందుకు చట్టబద్ధమైన అనుమతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత ప్రభుత్వం వడ్డెరలను గుర్తించి తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ చైర్మన్‌గా జైపాల్‌ను, తెలంగాణ రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్‌గా గుంజ రేణుకను నియమించడం పట్ల వడ్డెర సమాజం తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షుడు సాయిలు


