తప్పినట్టేనా! | - | Sakshi
Sakshi News home page

తప్పినట్టేనా!

Aug 9 2026 8:47 AM | Updated on Aug 9 2026 8:47 AM

ఎల్‌నినో ముప్పు

విస్తారంగా కురుస్తున్న వర్షాలు

ముమ్మరంగా పంటలసాగు

ఇప్పటివరకు 2.50 లక్షల ఎకరాలసాగు

ఇప్పటి వరకు 35% అధిక వర్షపాతం నమోదు

గతేడాదితో పోల్చితే మెరుగ్గా భూగర్భజలాలు

పత్తిపంట సాగు

జిల్లా వ్యాప్తంగా ఈసారి అన్నిరకాల పంటలు మూడు లక్షల పైచిలుకు ఎకరాల్లో సాగవుతాయని, అందులో సింహభాగం వరిపంట 2.50 లక్షల ఎకరాల్లో, పత్తితో పాటు ఇతర పంటలు 50 వేల ఎకరాలకు పైగా సాగవుతాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేసి అందుకు సరిపడా ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచారు. కాగా, జూన్‌ 2వ వారంలో రాష్ట్రానికి ఎల్‌నినో ముప్పు ఉందని, దీర్ఘకాలిక పంటలకు బదులుగా స్వల్పకాలిక పంటలను సాగు చేయాలని, వరికి బదులుగా ఆరుతడి పంటలను మాత్రమే సాగు చేయాలని వ్యవసాయశాఖ అధికారులు విస్తృతంగా అవగాహన కల్పించారు. ముఖ్యంగా పప్పు ధాన్యాలు సాగు చేయటం మంచిదంటూ వందశాతం సబ్సిడీపై కంది విత్తనాలను రైతులకు ఉచితంగా సరఫరా చేశారు. రైతువేదికల్లో విత్తన మేళాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు.

2.50 లక్షల ఎకరాల్లో సాగు!

జిల్లాలో చెప్పు కోదగ్గ సాగునీటి ప్రాజెక్టులు లేక పోవటంతో 90% రైతాంగం బోరుబావుల ఆధారంగానే పంటలను సాగుచేస్తారు. కాగా జూన్‌ మొదటి వారంలోనే బోరుబావుల వద్ద తుకాలు(నారుమళ్లు) పోశారు. ఆ నెలలో లోటువర్షపాతం నమోదు కావటంతో ఆందోళన చెందిన అన్నదాతలు ఆ తర్వాత మాసం జూలై నుంచి ఇప్పటివరకు విస్తారంగా వానలు కురవటంతో సాధారణ వర్షపాతాన్ని మించి ఎక్సెస్‌ వర్షపాతం నమోదైంది. దీంతో ఇప్పటివరకు 60 నుంచి 70% చెరువులు, కుంటలు నిండాయి. ఇప్పటివరకు 2,50,060 ఎకరాల్లో పంటలను సాగు చేశారు. ఇందులో సింహభాగం వరి 2.10 లక్షల ఎకరాలు సాగైంది. రెండో స్థానంలో పత్తి 38 వేల ఎకరాల్లో సాగు కాగా ఇతర పంటలు 2 వేల ఎకరాలకు పైచిలుకు సాగయ్యాయి. కాగా ఈ సంఖ్య మరో 30 వేల పై చిలుకు పెరగనుందని అధికారులు చెబుతుండగా అంతకుఎక్కువగానే సాగుకానున్నట్లు క్షేత్రస్థాయిలో తెలుస్తోంది. జిల్లాలో జూలై నాటికి భూగర్భజలాలు మొత్తంగా 13.73 మీటర్లలో లోతులో ఉన్నాయి. గతేడాది జూలైలో 14.16 మీటర్లలోతులో ఉండగా ఈ ఏడాది కాస్త మెరుగానే ఉన్నాయి.

35% అధికం!

వాతావరణ శాఖ అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో జూన్‌ నెల నుంచి ఇప్పటివరకు 368.8 మిల్లీ మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా ఇప్పటి వరకు 498.5 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ లెక్కన 129.8 మి.మీటర్ల వర్షం అధికంగా నమోదైంది. అంటే 35% వర్షం అధికంగా కురిసింది. దీంతో మెదక్‌ సీమకు పొంచి ఉన్న ఎల్‌నినో ముప్పు తప్పినట్టేనంటూ అన్నదాతలు సంతోషిస్తున్నారు.

పర్యావరణ శాస్త్రవేత్తలు, ప్రభుత్వ పెద్దలు, వ్యవసాయశాఖ అధికారులు అందరూ ఎల్‌నినో ముప్పు పొంచి ఉందని, ఆశించిన మేర వానలు కురవవని రైతులు స్వల్పకాలిక పంటలను మాత్రమే సాగు చేయాలంటూ పదేపదే చెబుతున్నారు. కానీ ఒక్క జూన్‌లోనే లోటు వర్షపాతం నమోదు కాగా ఆ తర్వాత విస్తారంగా కురుస్తున్న వర్షాలకు లోటునుంచి అధికవర్షపాతం నమోదైంది. ఇక ఎల్‌నినో ముప్పుతప్పినట్టేనని రైతాంగం విరివిగా పంటలను సాగు చేస్తున్నారు. సాధారణ సాగుకు చేరువలో ఉన్నారు. మెదక్‌జోన్‌:

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement