శివ్వంపేట(నర్సాపూర్): ఉమ్మడి జిల్లాలో ప్రసిద్ధి చెందిన సికింద్లాపూర్ లక్ష్మీనర్సింహస్వామిని మెదక్ జిల్లా కోర్టు న్యాయమూర్తి నీలిమ కుటుంబ సమేతంగా శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది న్యాయమూర్తికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం సత్యనారాయణస్వామి వ్రతాన్ని ఆచరించారు. ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వాదం చేశారు. ఆలయ ఈఓ శ్రీనివాస్ సన్మానించి ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ధనుంజయ్‌శర్మ, చండీకశర్మ, విద్యాకర్‌చారి, జూనియర్ సహాయకులు నర్సింహారెడ్డి, తదితరులున్నారు.
డీఎస్పీ ప్రసన్నకుమార్
హవేళిఘణాపూర్(మెదక్): పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టిసారించి నేరాల నియంత్రణకు కృషి చేయాలని మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ స్పష్టం చేశారు. ఆయన కార్యాలయంలో శనివారం సీఐ, ఎస్‌ఐలతో నేరాల కట్టడి, సైబర్ కేసులు, పెండింగ్‌లో ఉన్న కేసులు, నాన్‌బెయిలెబుల్ వారెంట్లు, డ్రగ్స్ నిర్మూలన వాటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. పోలీస్‌స్టేన్ల వారీగా రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించి రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సూచించారు. సమావేశంలో మెదక్ రూరల్ సీఐ కృష్ణమూర్తి, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
పంటపొలాలకు వెళ్లే దారిని ఆక్రమణ చేస్తున్నారని గ్రామస్తుల ఆగ్రహం
చిన్నశంకరంపేట(మెదక్): నార్సింగి మండలం జప్తిశివనూర్ జాతీయ రహదారిని అనుకుని ఉన్న మాజీమంత్రి షబ్బీర్ అలీ గెస్ట్‌హౌజ్ వద్ద నిర్మిస్తున్న ప్రహారీని గ్రామస్తులు ధ్వంసం చేశారు. పంటపొలాలకు వెళ్లేదారిని ఆక్రమించి గోడ నిర్మాణం చేపట్టడంతో గ్రామస్తులు ఆగ్రహంతో గోడను కూలకొట్టారు. జాతీయ రహదారి నుంచి చెరువుకట్టపై తాము పంటపొలాలకు వెళ్లేందుకు దారి ఉందని తెలిపారు. ఇంతకుముందు కూడా ఎలాంటి నిర్మాణాలు చేయవద్దని చెప్పినా వినకుండా అడ్డుగోడ పెట్టారని చెప్పారు. దీంతో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ప్రహారీని ధ్వంసం చేశారు. అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.


