రామచంద్రాపురం(పటాన్‌చెరు): పటాన్‌చెరులోని ప్రభుత్వ ఆస్పత్రిని వెంటనే ప్రారంభించాలని ఎమ్మెల్సీ అంజిరెడ్డి కోరారు. ఈమేరకు సోమవారం ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రితో పాటు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి ఆస్పత్రి అభివృద్ధిపై మంత్రిని కలిసి మాట్లాడినట్లు తెలిపారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలను అందించాలని కోరారు. రోగుల రద్ధీకి అనుగుణంగా వైద్యులు, పారా మెడికల్ సిబ్బందిని నియమించాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా రాష్ట్రంలో 104 సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. ఈ సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు.
శివ్వంపేట(నర్సాపూర్): భూ రీ సర్వేతో సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని జిల్లా సర్వే ఏడీ కిషన్, ఆర్డీఓ రామకృష్ణ అన్నారు. సో మవారం మండల పరిధిలోని లింగోజిగూడలో గ్రామస్తులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. భూముల పంచాయతీలతో నిత్యం జరుగుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రతి గుంట భూమిని సమగ్రంగా సర్వే చేస్తామన్నారు. అందుకు సంబంధించి రికార్డులు పొందుపరిచి నకిలీ పట్టాదారులను రికార్డుల నుంచి తొలగిస్తామన్నారు. రీ సర్వేకు రైతులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో డీఐఓఎస్ రాంరెడ్డి, తహసీల్దార్ కమలాద్రి, ఏఎస్‌ఐ సాయిలు, సర్పంచ్ అమృత, సర్వేయర్ అరుణ్‌కుమార్, ఆర్‌ఐ నిరంజన్ తదితరులు ఉన్నారు.
మెదక్ కలెక్టరేట్: జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఐటీఐ సెంటర్‌లో సోమవారం నిర్వహించిన జాబ్‌మేళాకు విశేష స్పందన లభించిందని జి ల్లా ఎంప్లాయీమెంట్ అధికారి రామరాజు తెలిపారు. హరేకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 72 పోస్టులకు జాబ్ మేళా నిర్వహించినట్లు చెప్పారు. ఇందులో మొత్తం 115 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, అభ్యర్థుల అర్హతను బట్టి 45 మందిని ఎంపిక చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో ట్రస్ట్ అధికారులు శివప్రసాద్, సుధీర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.
కొల్చారం(నర్సాపూర్): మండలంలోని తుక్కాపూర్‌లో సోమవారం పిల్లలు, గర్భిణులు, బాలింతలకు అందించిన పప్పు చారులో పురుగులు కనిపించాయి. దీంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదార్థాల మన్నికపై అంగన్‌వాడీ టీచర్ ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదంటూ ఆరోపించారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.
మెదక్ కలెక్టరేట్: రైస్ మిల్లులపై కొన్ని రోజులుగా విజిలెన్స్ తనిఖీలు విస్తృతంగా సాగుతున్నాయి. తాజాగా సోమవారం పట్టణంలోని ఓ రైస్ మిల్లులో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మిల్లులో ఎలాంటి సమస్యలు లేవని గుర్తించారు. కార్యక్రమంలో విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ పండరి, ఎస్‌ఐ వెంకటేశం, సివిల్ సప్లయ్ అధికారులు పాల్గొన్నారు.


