లింగ నిర్ధారణ పరీక్షలతో భ్రూణ హ త్యలు
సాక్షి, సిద్దిపేట: పేదరికం, మూఢ విశ్వాసాలు, స్కానింగ్ కేంద్రాల్లో లింగ నిర్ధారణ పరీక్షలు ఇతరత్రా కారణాలతో ఆడబిడ్డల్ని పురిటిలోనే చంపేస్తున్నారు. ఇందుకు కేంద్ర జనగణన విభాగం పౌర నమోదు వ్యవస్థ–(సీఆర్‌ఎస్)–విడుదల చేసిన 2024 నివేదికనే నిదర్శనం. ఈ నివేదికలో పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి. వెల్లడైన గణాంకాల ప్రకారం ఉమ్మడి జిల్లాలో లింగ ఆధారిత వివక్ష స్పష్టంగా దర్శనమిస్తోంది. ఉమ్మడి జిల్లాలో 2024లో మగపిల్లలు 40,577 పుట్టగా ఆడబిడ్డలు 37,109 మంది జన్మించారు. అయితే 2023తో పోల్చితే 2024లో ఆస్పత్రుల్లో శిశు మరణాలు తగ్గుముఖం పట్టడం ఈ నివేదికలో ఊరటనిచ్చే అంశం.
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 2023లో 72,545 మంది జన్మించగా, 2024లో 77,686 మంది పుట్టారు. ఈ నివేదిక ప్రకారం చూస్తే జననాలు 5,141 పెరిగాయి. ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా సంగారెడ్డిలో, అత్యల్పంగా సిద్దిపేటలో జన్మించారు. 2024లో 1000 మంది మగ పిల్లలకు 915 మంది ఆడపిల్లలు పుట్టారు. కొన్ని ప్రైవేట్ క్లినిక్‌లలో ఆర్ ఎంపీలు గర్భంలోనే ఆడ,మగను నిర్ధారిస్తుండటంతో ఆడపిల్ల అని తెలియగానే పిండ దశలో చిదిమేస్తున్నారు. దీంతో ఆడ పిల్లల సంఖ్య తగ్గిపోతున్నారు.
తగ్గిన శిశు మరణాలు
ఉమ్మడి మెదక్ జిల్లాలో శిశు మరణాలు తగ్గుముఖం పట్టాయి. 2023లో 501 మంది శిశువులు మృతి చెందితే అందులో మగవాళ్లు 294, ఆడపిల్లలు 207 ఉన్నారు. 2024లో 467 మంది శిశువులు మృతి చెందగా అందులో మగవారు 251, ఆడ శిశువులు 216 మంది ఉన్నారు. 2023కంటే 2024లో శిశు మరణాలు తగ్గాయి. ప్రభుత్వం ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో శిశు మరణాలు తగ్గాయని చెప్పవచ్చు.
2024లో మరణాలు
జిల్లా మగ ఆడ మొత్తం
సిద్దిపేట 3,032 2,001 5,033
సంగారెడ్డి 5,920 4,086 10,006
మెదక్ 4,143 2,985 7,128


