కలెక్టర్ ప్రతిమాసింగ్
కొల్చారం(నర్సాపూర్): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. మంగళవారం మండలంలో పర్యటించి నిర్మాణంలో ఉన్న ఇళ్లను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. నిర్మాణ పనులు ప్రారంభించకుంటే రద్దయ్యే అవకాశం ఉందని తెలిపారు. లబ్ధిదారులకు భారం కాకుండా ఉండేందుకు చిన్న సైజులో 450 ఫీట్ల నుంచి నిర్మాణం చేసుకోవచ్చని సూచించారు. అక్కడి నుంచి వరిగుంతం చేరుకున్న కలెక్టర్ గ్రామంలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేందుకు కృషి చేయాలని బీఎల్‌ఓలు, అధికారులను ఆదేశించారు. బూత్‌స్థాయిలో ఫారాల పంపిణీ, స్వీకరణ, డేటా ఎంట్రీ పురోగతిపై ఆరా తీశారు. ఫారాలు పంపిణీ చేయడం మాత్రమే కాకుండా, పూర్తిగా పూరించిన దరఖాస్తులను తిరిగి సేకరించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. మరణించిన, ఇతర ప్రాంతాలకు మారిన ఓటర్ల వివరాలను ప్రత్యేకంగా నమోదు చేసి, నిబంధనల ప్రకారం ముందుకెళ్లాలని సూచించారు. కలెక్టర్ వెంట హౌసింగ్ పీడీ మాణిక్యం, తహసీల్దార్ శ్రీనివాస్ చారి, ఎంపీడీఓ రఫీక్ ఉన్నీసా బేగం, సర్పంచ్‌లు శేఖర్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.


