మెదక్ కలెక్టరేట్: జిల్లాలో ఇప్పటివరకు 55 శాతం ‘సర్’ ఎన్యూమరేషన్ ప్రక్రియ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. జిల్లాలో మొత్తం 4,55000 మంది ఓటర్లు ఉండగా, వీరందరికి ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ పూర్తి చేశారు. మంగళవారం మెదక్ పట్టణంలోని 11వ వార్డులో జరుగుతున్న ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియను కలెక్టర్ ప్రతిమాసింగ్ పరిశీలించారు. బీఎల్‌ఓలు ఇంటింటి పత్రాలు అందజేయడంతో పాటు వాటిని భర్తీ చేసేందుకు ఓటర్లకు సహకరించాలని ఆదేశించారు. అవసరమైన చోట రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ సిబ్బందితో పాటు ఆశావర్కర్ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. మున్సిపల్ కౌన్సిలర్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల ఏజెంట్లను సమన్వయం చేసుకుంటూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా వీడియోలు, సందేశాలు పంపించి ప్రజల్లో చైతన్యం కల్పించాలని స్పష్టం చేశారు. ప్రతి ఓటరు తప్పనిసరిగా ‘సర్’ నమోదు చేసుకోవాలని, నిర్లక్ష్యం చేస్తే ఓటు తొలగిపోతుందన్నారు. కాగా, శని, ఆదివారాల్లో అన్ని మండలాలు, మున్సిపాలిటీ పరిధిలో ప్రత్యేక ఎస్‌ఐఆర్ శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు. ఈనెల 24లోపు నమోదు ప్రక్రియను వందశాతం పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.


