మిల్లర్లతో మిలాఖత్‌ | - | Sakshi
Sakshi News home page

మిల్లర్లతో మిలాఖత్‌

Apr 11 2026 9:16 AM | Updated on Apr 11 2026 9:16 AM

సీఎంఆర్‌లోనిబంధనలకు పాతర

కేంద్రాల నిర్వాహకులు, స్టేజ్‌ 1 కాంట్రాక్టర్ల మాయాజాలం

జిల్లాలో 7 మిల్లులకే 2.69 లక్షల క్వింటాళ్ల సన్నధాన్యం

కస్టమ్స్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌)లో నిబంధనలకు పాతరేస్తున్నారు. లాభదాయకంగా ఉండటంతో మిల్లర్లంతా సన్న వడ్ల కోసం ఎగబడుతున్నారు. ఇందులో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, స్టేజ్‌ 1 కాంట్రాక్టర్లు, ట్రాన్స్‌పోర్టు డ్రైవర్లు చక్రం తిప్పుతున్నారు. మ్లిలర్లతో కుమ్మకై , కమీషన్లు ఇచ్చే వారికే సన్న వడ్లు పంపుతున్నారు. గత వానాకాలంలో జిల్లాలో 14,28,712 క్వింటాళ్ల సన్న వడ్లు సీఎంఆర్‌ కింద సేకరించగా, ఇందులో కేవలం 7 మిల్లులకే 2,68,839 క్వింటాళ్లు ఇచ్చారు. మిగితా 94 మిల్లులకు 11,59,873 క్వింటాళ్లు పంపిణీ అయ్యాయి. ప్రస్తుత యాసంగి సీజన్‌లోనైనా న్యాయంగా సన్నాల కేటాయింపులు జరపాలని మిల్లర్లు కోరుతున్నారు.

– మెదక్‌ అర్బన్‌

త వానాకాలం సీజన్‌లో జిల్లాలో మొత్తం 37,57,896 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించారు. అందులో 14,28,712 క్వింటాళ్ల సన్నాలు ఉన్నాయి. సీఎంఆర్‌ కోసం జిల్లాలోని 101 మిల్లులకు ధాన్యం కేటాయించారు. అయితే సన్న వడ్లు మ్లిలర్లకు లాభదాయకంగా ఉండటంతో డిమాండ్‌ ఏర్పడింది. దీంతో మిల్లర్లు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు, స్టేజ్‌ 1 కాంట్రాక్ట్‌ ట్రాన్స్‌పోర్టర్లకు ప్రలోభాల ఆశ చూపారు. దీంతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కమీషన్లకు ఆశపడి, తమకు అనుకూలమైన మిల్లర్లకు సన్న వడ్లు పంపిణీ చేశారు. అలాగే ట్రాన్స్‌పోర్టు డ్రైవర్లు, స్టేజ్‌ 1 కాంట్రాక్టర్లు సైతం తమతో అంటకాగిన మిల్లర్ల పంచన చేరారన్న విమర్శలున్నాయి. జిల్లాలో పెద్దశంకరంపేట, పాపన్నపేట, మెదక్‌, నర్సాపూర్‌ మండలాల్లోని ఏడు మిల్లులకు 2,68,839 క్వింటాళ్ల సన్న వడ్లు కేటాయించారు. కొంతమంది మిల్లర్లు సన్నాల కోసం రైతులకు క్వింటాల్‌కు రూ.50తో పాటు, హమాలీ చార్జీలు కూడా చెల్లించినట్లు తెలుస్తోంది. మరికొంత మంది మిల్లర్లు మరో అడుగు ముందుకేసి, తమ లారీలను కొనుగోలు కేంద్రాలకు పంపి సన్న వడ్లు తెప్పించుకున్నారు. అయితే స్టేజ్‌ 1 కాంట్రాక్టర్లు వీరికి, ట్రాన్స్‌పోర్టు చార్జీలు చెల్లించే అవకాశం లేకపోయినప్పటికీ, ఇరువర్గాలకు ఈ దందా లాభదాయకంగా మారింది.

సిరులు కురిపిస్తున్న సన్నాలు

సన్న వడ్ల ద్వారా క్వింటాల్‌కు నూకలతో కలిపి సుమారు 67 కిలోల బియ్యం వస్తున్నట్లు తెలుస్తుంది. దొడ్డు వడ్ల ద్వారా తక్కువ బియ్యం వస్తున్నాయి. అలాగే సన్నాలు మెదక్‌లోని సివిల్‌ సప్లై ద్వారా మామూళ్లు మాటున సులభంగా పాస్‌ అవుతాయన్న ఆరోపణలున్నాయి. ఇక దొడ్డు బియ్యం ఎఫ్‌సీఐ ద్వారా పాస్‌ కావాలి. అక్కడ మామూళ్లు తప్పకున్నా, క్వాలిటీ చూస్తారని, అందువల్ల మిల్లర్లు ఎక్కువగా సన్న వడ్ల కోసం ఎగబడుతున్నారు. గతేడాది సన్నాలు తీసుకున్న మిల్లర్లు క్వింటాల్‌కు రూ.25 చొప్పున అసోసియేషన్‌కు చెల్లించాలని, అన్ని మిల్లులకు సమానం వడ్లు కేటాయించాలని యూనియన్‌ తీర్మానించింది. ఈ విషయమై సివిల్‌ సప్లై డీఎం జగదీశ్‌ను వివరణ కోరగా.. సన్న, దొడ్డు వడ్లు అన్న వివరాలు తమ వద్ద ఉండవని, అవి మిల్లర్‌ అసోసియేషన్‌ చూసుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement