మెదక్ కలెక్టరేట్: ‘హాస్టల్‌లో కనీస వసతులు లేవు.. కడుపునిండా తిండిలేక అల్లాడిపోతున్నామని’ నర్సింగ్ కళాశాల విద్యార్థినులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం పట్టణంలోని కళాశాల నుంచి రాందాస్ చౌరస్తా వరకు మండుటెండలో నిరసన ర్యాలీ చేపట్టారు. విషయం తెలుసుకున్న అధికారులు విద్యార్థులను సముదాయించారు. కలెక్టర్‌కు మొర పెట్టుకుంటామని చెప్పడంతో బస్సు ఏర్పాటు చేసి కలెక్టరేట్‌కు తీసుకెళ్లారు. అనంతరం అక్కడ ఆందోళన చేపట్టారు. హాస్టల్‌లో 120 మందికి కేవలం ఒకటే టాయిలెట్ ఉందని, రెండు రోజులకోసారి స్నానం చేయాల్సిన దుస్థితి నెలకొందని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీనెల ప్రిన్సిపాల్ మెయింటనెన్స్ కోసం డబ్బులు వసూలు చేస్తున్నా రని ఆరోపించారు. కలెక్టర్ ప్రతిమాసింగ్‌ను కలిసి సమస్యలను మొరపెట్టుకున్నారు. అనంతరం కలెక్టర్, డీఐఈఓ మాధవి నర్సింగ్ కళాశాలను సందర్శించారు. విద్యార్థులకు కనీస వసతులు లేని మాట వాస్తవమేనని, విద్యార్థులకు మంచి భోజనం పెట్టకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


