ఖానాపూర్: గిరిజన ప్రాంతాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్ కోరారు. బుధవారం హైదరాబాద్‌లో గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సబ్యసాచి ఘోష్‌ను కలిశారు. దండారీ ఉత్సవాల నిర్వహణకు రూ.1.50 కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరారు. ఉట్నూర్, భద్రాచలం డీఎడ్, బీఎడ్ కళాశాలల్లో టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. గిరిజన యువతకు పోటీ పరీక్షల శిక్షణ అందించేందుకు ఐఏఎస్ అకాడమీ కేంద్రాలతోపాటు మహిళలు, పురుషులకు ప్రత్యేక హాస్టళ్లు ఏర్పాటు చేయాలని కోరారు. కేస్లాపూర్ నాగోబా జాతర అభివృద్ధికి రూ.21 కోట్ల నిధులతో జీవో విడుదల చేయడం, రోడ్ల అభివృద్ధికి రూ.15 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు ఘోష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.


