గత యాసంగి వడ్లకు టెండర్ పిలుపు
మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు మూడు లాట్లు
2.26లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యపు నిల్వలు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: గత యాసంగి సేకరించిన(2025–26రబీ) ధాన్యాన్ని వేలం వేయనున్నా రు. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. మంచిర్యాల, నిర్మల్ జిల్లాల పరిధిలో ఉన్న దొడ్డు రకం ధాన్యాన్ని లాట్‌ల కింద చేర్చి టెండర్ పిలిచింది. ఈ నెల 28న టెండర్ ఓపెన్ చేయనున్నారు. రెండు జిల్లాల పరిధిలో ఉన్న రైస్ మిల్లులతోపాటు గోదాంల్లో నిల్వ చేసిన వడ్లను సైతం వేలంలో చేర్చారు. రెండు జిల్లాలో మొత్తం ధాన్యాన్ని మూడు లాట్లుగా నిర్మల్, మంచిర్యాలతోపాటు మరో లాట్‌లో సిరిసిల్ల పరిధిలోని వడ్లకు కూడా టెండరు పిలిచారు. మంచిర్యాల జిల్లాలో 26, నిర్మల్ జిల్లాలో 30మిల్లులను మొత్తం గోదాంల్లో ఉన్న వడ్లను కలిపి మూడు లాట్లుగా విభజించారు. ఒక లాట్‌లో సిరిసిల్ల జిల్లా ధాన్యం చేర్చారు. ఒక్కో లాట్‌కు 50వేల మెట్రిక్ టన్నుల చొప్పున మొత్తం 150మెట్రిక్ టన్నులకు వేలం వేయనున్నారు. పౌరసరఫరాల శాఖ కనీస ధర క్వింటాల్‌కు రూ.2,389 చొప్పున ధర రిజర్వు చేశారు. టెండర్‌లో పాల్గొనే బిడ్డర్లు ఇంతకంటే తక్కువ టెండర్ కోట్ చేయరాదు. అర్హత కలిగిన వారంతా వేలంలో పాల్గొని ధాన్యాన్ని దక్కించుకోవచ్చు. ఈ మేరకు టెండరు నిర్వహణ మూడు ఏజెన్సీలకు అప్పగించారు. అయితే ధర విషయంలో బిడ్డర్లు ముందుకు వస్తారా? లేదా? అనేది తేలనుంది.
కొనసాగుతున్న తనిఖీలు
మరోవైపు సీఎంఆర్ ఇస్తున్న మిల్లుల్లో పీవీ(ఫిజికల్ వెరిఫికేషన్) జరుగుతోంది. ప్రతీ బుధవారం ఈ మేరకు ధాన్యం నిల్వలపై పరిశీలనలు జరుగుతున్నాయి. గతంలో వలే కాకుండా పకడ్బందీగా పరిశీలనలు చేస్తున్నారు. రెవెన్యూ అధికారులతోపాటు సివిల్ సప్లయి అధికారులు పాల్గొంటున్నారు. దీంతో మిల్లర్లు తమ బియ్యం బాకీలను అప్పగించడంతోపాటు పౌరసరఫరాల శాఖకు బాకీ ఉన్న మొత్తాన్ని చెల్లిస్తున్నారు.


