రైళ్లలో అక్రమ వ్యాపారాలు! | - | Sakshi
Sakshi News home page

రైళ్లలో అక్రమ వ్యాపారాలు!

Sep 25 2026 2:05 AM | Updated on Sep 25 2026 2:05 AM

అనుమతి లేని నిషేధిత వస్తువుల విక్రయాలు సులువుగా లభిస్తున్న పొగాకు ఉత్పత్తులు పట్టించుకోని అధికారులు

ఆసిఫాబాద్‌క్రైమ్‌: చైన్నె– న్యూఢిల్లీ ప్రధాన రైల్వే మార్గంలోని కాగజ్‌నగర్‌– బల్లార్షా మధ్యలోని రైల్వే స్టేషన్ల కేంద్రంగా అక్రమ వ్యాపారాలు ఊపందుకున్నాయి. రైల్వే శాఖ నిబంధనలకు విరుద్ధంగా కొందరు నిషేధిత వస్తువులు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తెలంగాణ– మహారాష్ట్ర సరిహద్దుకు ఆనుకుని అటు వైపు బల్లార్షా జంక్షన్‌ రైల్వే స్టేషన్‌ (మహారాష్ట్ర) ఉండగా, ఇటు వైపు కాగజ్‌నగర్‌ రైల్వే స్టేషన్‌ (తెలంగాణ) ఉంది. ఈ రూట్‌లో నడిచే దాదాపు అన్ని రైళ్లకు ఈ రెండు స్టేషన్లలో హాల్ట్‌ ఉంటుంది. బల్లార్షా నుంచి వెళ్లే ఎక్కువ శాతం రైళ్లు నేరుగా కాగజ్‌నగర్‌ రైల్వే స్టేషన్‌లో ఆగుతుండగా, కాగజ్‌నగర్‌ రైల్వే స్టేషన్‌ నుంచి బయలుదేరే ప్రతీ రైలు నేరుగా బల్లార్షా జంక్షన్‌ వద్ద ఆగుతోంది. బల్లార్షాకు చెందిన కొందరు ఒక టీంగా ఏర్పడి ప్రతీ ప్యాసింజర్‌లో అనుమతి లేని తినుబండారాలు, నిషేధిత పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. ఇందుకు సొంతంగా తమ మనుషులను నియమించుకుని అక్రమ వ్యాపారాలు సాగిస్తున్నారు.

చోరీలకు ఆస్కారం

బల్లార్షా కేంద్రంగా సాగుతున్న ఈ అక్రమ వ్యాపారం కారణంగా రైళ్లలో చోరీలు సైతం పెరిగే అవకాశం ఉంది. కాగజ్‌నగర్‌, బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం వంటి ముఖ్య స్టేషన్ల పరిధిలో చోరీ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. అనుమతి లేని వస్తువులు, తిను బండారాలు అమ్ముతున్న వెండర్ల(విక్రయదారులు) వద్ద గుర్తింపు కార్డులు లేకపోవడం, ఒక ట్రావెల్‌ బ్యాగ్‌ భుజాన వేసుకుని విక్రయాలు జరుపుతున్న వారి గుర్తింపు సైతం ఎవరికీ తెలియదు. ఇదే ముసుగులో కొందరు చోరీలకు సైతం పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. రైల్వే శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికై నా జోక్యం చేసుకుని.. తనిఖీలు నిర్వహించాలని, అక్రమ వ్యాపారాలపై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

జోరుగా అమ్మకాలు

కాగజ్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి బల్లార్షాకు చెందిన టీంతో సంబంధాలు పెట్టుకుని అక్రమ వ్యాపారాల్లో పాలుపంచుకుంటున్నట్లు తెలు స్తోంది. ప్రతీ రైలులో గుట్కా, ఖైనీ, సిగరేట్‌, బీడీలు వంటి నిషేధిత ఉత్పతులతో పాటు రైల్వే శాఖ అనుమతి లేని నాణ్యత లోపించిన తిను బండారాలను సైతం విక్రయిస్తున్నారు. దాదాపు అన్ని ట్రైన్లలో వ్యసనపరులకు సులభంగా నిషేధిత పొగాకు ఉత్పత్తులు అందుబాటులో ఉంచుతున్నారు. కాజీపేట్‌ నుంచి బల్లార్షా వైపు వయా కాగజ్‌నగర్‌ మీదుగా వెళ్లే ఎక్కువశాతం ఎక్స్‌ప్రెస్‌, సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలోని జనరల్‌ బోగీలు ప్రయాణికులతో కిక్కిరిసి ఉంటాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లే రైళ్లల్లోని జనరల్‌ బోగీల్లో అసలు కాలు పెట్టే స్థలం కూడా ఉండదు. ఇలాంటి చోట వ్యసనపరులు గుట్కా ఉమ్మివేయడం, బీడీ, సిగరేట్‌లు తాగుతుండటంతో ప్రయాణికుల ఇబ్బంది పడటంతోపాటు బోగీలు అపరిశుభ్రంగా మారుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement