సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పేకాట దందా రోజు రూ.లక్షల్లో సాగుతోంది. గంటల్లో జేబులు గుల్ల చేసుకునే జూదరులే లక్ష్యంగా దందా నడుస్తోంది. ఇక్కడి పోలీసులకు చిక్కకుండా ఉమ్మడి జిల్లా మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో అనేక అనధికార క్లబ్బులు నడుస్తున్నాయి. రాజురా, పొడ్సా, సోన్లూరి, పఠాన్‌భోరి, రనవెల్లి, గట్‌చందూర్ పరిసర ప్రాంతాల్లో అనధికార పేకాట క్లబ్‌లు ఉన్నాయి. సోషల్ క్లబ్‌ల పేరిట చట్ట విరుద్ధంగా పేకాట క్లబ్‌లు నిర్వహిస్తున్నారు. ఈ వ్యసనంతో అనేక మంది రోజు రూ.లక్షల్లో పోగొట్టుకుంటున్నారు. జిల్లాలో పేకాట ఆడితే పోలీసులకు దొరికిపోతామని మహారాష్ట్రకు వెళ్లి మరీ సరదా తీర్చుకుంటున్నారు. ఇందుకు నిర్వాహకులు ఫంటర్ల(పేకాట ఆడేవారు)కు రవాణా, భోజనం, మద్యం, ఏసీ గదుల్లో పేకాటకు టేబుళ్లు వేసి మరీ డబ్బుల దందా చేస్తున్నారు. సెలవు దినాల్లో పెద్ద ఎత్తున కార్లలో వెళ్తూ జేబులు గుల్ల చేసుకుని వస్తున్నారు. దీంతో అనేకమంది కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. రెండు రోజుల క్రితం వీరూర్ పరిధి సోన్లూర్‌లో సోషల్ విన్నర్ క్లబ్‌లో స్థానిక పోలీసులు దాడులు చేసి 40మందిపై కేసులు నమోదు చేశారు. రూ.6.76లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరందరూ మంచిర్యాల, ఆసిఫాబాద్, గోదావరిఖని, ఉమ్మడి కరీంనగర్ తదితర ప్రాంతాలకు చెందిన వారే ఉన్నారు.
రూ.కోట్లలో పేకాట
పేకాట క్లబ్బుల కోసం రూ.కోట్లలోనే ఖర్చు చేస్తున్నారు. రమ్మీ, తీన్‌పత్తా, కట్‌పత్తా ఆటల్లో గంటల్లోనే రూ.లక్షలు పోగొట్టుకుంటారు. ప్రతీ ఆటలో నిర్వాహకులకు కనీసం పది శాతం కమీషన్ ఉంటుంది. ఒక్కో టేబుల్‌కు రెండు మూడు గంటల్లోనే రూ.10నుంచి రూ.20వేలు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అలా ఒక్కో క్లబ్బులో 20నుంచి 30టేబుళ్లు వేస్తూ రాత్రింబవళ్లు నడిపిస్తున్నారు. ఆదివారం, ఇతర సెలవు దినాల్లో టేబుళ్లు ఒక్కటి కూడా ఖాళీగా ఉండవంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తెచ్చుకున్న డబ్బులు అయిపోయాక కూడా తెలిసిన వారి నుంచి అప్పులు తీసుకుని మరీ ఆడుతున్నారు.
సరిహద్దు దాటితే ఓకే..
మహారాష్ట్రలో షరతులతో కూడిన అనుమతిచ్చిన క్లబ్బుల్లో రమ్మీ ఆడుకోవచ్చు. అయితే క్లబ్బుల్లోని సభ్యులకు మాత్రమే. అది కూడా ఎలాంటి ధన, ఇతర వస్తువుల రూపంలో బెట్టింగ్ లేకుండా ఆడుకోవచ్చు. దీనిని ఆసరా చేసుకుని స్పోర్ట్స్, ఇండోర్ గేమ్స్, సోషల్ క్లబుల పేరుతో అక్కడి వారి పేరుతో జిల్లా వాసులే అంతా నడిపిస్తున్నారు. తెలంగాణ సరిహద్దు దాటితే ఇక్కడి పోలీసులకు అధికారం ఉండదు. దీంతో ఆ రాష్ట్రంలో క్లబుల మాటున పెద్ద ఎత్తున పేకాట దందా సాగిస్తున్నారు. గతంలో ఆసిఫాబాద్ జిల్లా పోలీసులు సరిహద్దు గ్రామాలైన గోయగాం, సిర్పూర్(టీ) వైపు పెన్‌గంగా వద్ద చెకింగ్‌లతో కొంత మేర తగ్గింది. ప్రస్తుతం ఎలాంటి చెకింగ్‌లు లేకపోవడంతో విచ్చలవిడిగా జూదం సాగుతోంది. అక్కడి ప్రభుత్వం ఈ క్లబ్‌లపై పకడ్బందీ నిఘా పెడితే తప్ప జూదం నిలిచే అవకాశాలు లేవు.
ఆడేది.. ఆడించేది జిల్లా వాసులే..
పేకాట వ్యసనంగా మారిన అనేక మంది నిర్వాహకులుగా మారి క్లబ్‌లు నిర్వహిస్తున్నారు. గోదావరిఖని ఏన్టీపీసీకి చెందిన ఓ వ్యక్తి అనేక సార్లు కేసుల పాలైనప్పటికీ ఈ దందా వదలడం లేదు. వీరే కాకుండా మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఓ వడ్డీ వ్యాపారి, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు ఈ వ్యసనానికి బానిసలయ్యారు. మళ్లీ వీరే రూ.లక్షలు పెట్టి క్లబ్‌లు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రానికి చెందిన కొందరు దేగ్లూర్‌లో క్లబ్ నడిపేందుకు ఒక్కొక్కరు రూ.లక్షల కొద్దీ డబ్బులు కుమ్మరించారు. అంతకుముందు పోడ్స, రాజురా పరిసర ప్రాంతాల్లోని క్లబ్‌ల్లో జిల్లాకు చెందిన వారే వాటాదారులుగా ఉన్నారు.


