మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల సంక్షేమం కోసం అల్పాహారం ప్రవేశపెట్టిన ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్నీ అమలు చేస్తోంది. విదార్థులకు ఆకలి బాధలు లేకుండా, పౌష్టికాహార లోపం తగ్గించడమే ధ్యేయంగా ప్రవేశపెట్టింది. రోజూ రుచికర, శుభ్రమైన భోజనం వడ్డిస్తున్నారు. హరేకృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ పర్యవేక్షణలో మొదటి దఫాలో మంచిర్యాల నియోజకవర్గం దండేపల్లి, లక్సెట్టిపేట, మంచిర్యాల కళాశాలల్లో అల్పాహారం అందజేస్తుండగా.. వారం రోజుల క్రితం నుంచి మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్నారు.
విడతల వారీగా..
జిల్లాలోని పది ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 4,664 మంది విద్యార్థులు ఉన్నారు. మొదటి విడతలో మూడు కళాశాలల్లో అమలు చేస్తుండగా రెండో విడత చెన్నూర్ నియోజకవర్గంలోని జైపూర్, చెన్నూ ర్ కళాశాలల్లో మంగళవారం నుంచి మధ్యాహ్న భోజనం అమల్లోకి రానుంది. అల్పాహారంలో సాంబార్ ఇడ్లీ, ఉప్మా, పూరి, బోండాలు అందిస్తున్నారు. మధ్యాహ్న భోజనంలో కర్రీ, పప్పు, రైస్ అందిస్తున్నారు. పరీక్షల సమయాల్లో అధ్యాపకులు, స్వచ్ఛంద సంస్థలు మధ్యాహ్న భోజనం అందించగా.. ప్రస్తుతం ప్రభుత్వమే అమలు చేస్తోంది.


