పీఎస్సార్‌కు మంచి స్థానం లభిస్తుంది..! | - | Sakshi
Sakshi News home page

పీఎస్సార్‌కు మంచి స్థానం లభిస్తుంది..!

Sep 22 2026 12:30 AM | Updated on Sep 22 2026 12:30 AM

కాంగ్రెస్‌ పార్టీ కోసం కష్టపడ్డ వారికి మంచి జరుగుతుంది..

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు

ఘనంగా ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు జన్మదిన వేడుకలు

మంచిర్యాలటౌన్‌: కాంగ్రెస్‌ పార్టీ కోసం కష్టపడ్డ వారికి మంచి జరుగుతుందని, మంచిర్యాల ఎమ్మె ల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు(పీఎస్సార్‌) పార్టీ అధికారంలో లేకున్నా, పార్టీ కోసం ఎంతగానో కష్టపడ్డారని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. అందరిలోనూ ఎమ్మెల్యేకు మంచి స్థానం లభించాలనే కోరిక ఉందని, అది నెరవేరుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. మంచిర్యాల ఎమ్మెల్యే కే.ప్రేమ్‌సాగర్‌రావు జన్మదిన వేడుకలను సోమవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌ హాలులో ఘనంగా నిర్వహించారు. భారీ ఎత్తున మోటారుసైకిళ్లు, కార్ల ర్యాలీతో సభాస్థలికి చేరుకున్నారు. గజమాల వేసి ఎమ్మెల్యేను సత్కరించారు. అనంతరం మంత్రులు శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ప్రభుత్వ విప్‌ విజయరమణరావుతో కలిసి కేక్‌ కట్‌ చేశారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ మంచిర్యాలను రాష్ట్రంలోనే అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారని అన్నారు. ప్రజల కోసం చేస్తున్న శ్రమ అంతా ఇంతా కాదని, కాంగ్రెస్‌ పార్టీ బలోపేతం కోసం ఎంతగానో కృషి చేశారని అన్నారు.

దమ్ముంటే మీటింగ్‌ నిర్వహించండి..

కాంగ్రెస్‌ పార్టీ కోసం ఎక్కడైనా దళితులు ఎంత మందితోనైనా తాను మీటింగ్‌ను ఒక్క రూపాయి తీ సుకోకుండా నిర్వహిస్తానని, దమ్ముంటే మీరు తనకంటే ఎక్కువమంది దళితులతో మీటింగ్‌ నిర్వహించి చూపాలని ఎమ్మెల్యే కే.ప్రేమ్‌సాగర్‌రావు పరోక్షంగా మంత్రి వివేక్‌కు సవాల్‌ విసిరారు. తాను మీటింగ్‌ నిర్వహించలేకుంటే రాజీనామా చేస్తానని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ పార్టీ కోసం కష్టపడ్డానని, పార్లమెంట్‌ ఎన్నికల్లో తామంతా మద్దతుగా నిలిస్తే, తాను అనారోగ్యంతో ఉన్న సమయంలో తనను కొందరు మానసిక క్షోభకు గురి చేస్తున్నారని అన్నారు. మంచిర్యాలలో గంజా యి బ్యాచ్‌లకు తావులేదని, తమ కార్యకర్తల చీమలదండు కదిలిందని, గంజాయి బ్యాచ్‌ల సంగతి చూసుకుంటారని అన్నారు. గంజాయి బ్యాచ్‌లను విడిచేది లేదని, ఇక్కడ పార్టీ మాత్రమే ముఖ్యమని అన్నారు. దళితులను అణగదొక్కిన వారు దళితుల తరుఫున మాట్లాడుతున్నారని, దళితులకు సమన్యాయం చేసింది తానేనని అన్నారు. కొందరు అధికారులు కూడా తమ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారని తెలిపారు.

భారీ ర్యాలీ

శ్రీరాంపూర్‌: ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు జన్మదినాన్ని పురస్కరించుకొని శ్రీరాంపూర్‌ జీఎం కార్యాలయం నుంచి భారీ మోటార్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. జీఎం కార్యాలయం వద్ద మంత్రులు దుదిళ్ల శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌, ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావులకు ప్రేంసాగర్‌రావు స్వాగతం పలికారు. అక్కడి నుంచి సీసీసీ కార్నర్‌ వరకు ర్యాలీ నిర్వహించారు.

మంచిర్యాల అభివృద్ధికి కృషి

మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ప్రేంసాగర్‌రావు మంచిర్యాలలో అనేక అభివృద్ధి పనులు చేపట్టారన్నారు. ఆసుపత్రి నిర్మాణం, మెడికల్‌ కాలేజీ, స్కూల్స్‌ వంటి అనేక అభివృద్ధి పనులు చేస్తున్నారని అన్నారు. అనంతరం టాప్‌లెస్‌ జీపులో మంచిర్యాల వరకు ర్యాలీగా చేరుకున్నారు. పెద్దయెత్తున కార్మికులు, పార్టీ శ్రేణులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తుడా మాజీ చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌, మంచిర్యాల నగర మేయర్‌ ధర్ని మధూకర్‌, డిప్యూటీ మేయర్‌ చల్లా రమ్య, కాంగ్రెస్‌ పార్టీ కార్పొరేషన్‌ అధ్యక్షుడు తూముల నరేశ్‌, పీసీసీ నాయకులు చిట్ల సత్యనారాయణ, ఏఎంసీ చైర్మన్‌ బానేశ్‌, కార్పొరేటర్లు రాచకొండ గోపాల్‌రావు, ఖాలిద్‌, బండారి సుధాకర్‌, రవీందర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement