● పోర్టబుల్‌ ఎక్స్‌రేతో వ్యాధిగ్రస్తుల గుర్తింపు ● 2030 నాటికి వ్యాధిరహిత జిల్లా.. | - | Sakshi
Sakshi News home page

● పోర్టబుల్‌ ఎక్స్‌రేతో వ్యాధిగ్రస్తుల గుర్తింపు ● 2030 నాటికి వ్యాధిరహిత జిల్లా..

Sep 7 2026 3:08 AM | Updated on Sep 7 2026 3:08 AM

● పోర్టబుల్‌ ఎక్స్‌రేతో వ్యాధిగ్రస్తుల గుర్తింపు ● 2030 నాటికి వ్యాధిరహిత జిల్లా..

మంచిర్యాలటౌన్‌: జిల్లాలో క్షయ అంతమే లక్ష్యంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పరీక్షలను ముమ్మరం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన లక్ష్యం 2030 కాగా, ఆలోపు జిల్లాలో క్షయను పూర్తిగా నిర్మూలించడమే ధ్యేయంగా ముందుకెళ్తున్నారు. 2025 డిసెంబర్‌లో క్షయను నిర్ధారించేందుకు మూడు ఆల్ట్రా పోర్టెబుల్‌ హ్యాండిల్‌ ఎక్స్‌రే యంత్రాలు జిల్లాకు కేటాయించగా, ప్రస్తుతం రెండు యంత్రాలతో క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తిస్తున్నారు. అనుమానితులను గతంలో జిల్లా ఆసుపత్రికి తరలించి పరీక్షించేవారు. కానీ ఇప్పుడు నేరుగా ఎక్స్‌రే మిషన్‌ను వెంట తీసుకెళ్లి అక్కడే పరీక్షిస్తున్నారు. ‘టీబీ ముక్త్‌ భారత్‌ అభియాన్‌’ పేరుతో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షల్లో వందల సంఖ్యలో వ్యాధ్రిగస్తులను గుర్తిస్తూనే, వారికి వెనువెంటనే వైద్య పరీక్షలు ప్రారంభిస్తున్నారు. ఆరు నెలల కోర్సుతో క్షయ వ్యాధి నుంచి విముక్తి లభించనుండగా, మందులను సకాలంలో వాడేలా వ్యాధిగ్రస్తులకు అవగాహన కల్పిస్తున్నారు.

694 మంది గుర్తింపు

గతంలో కేవలం జిల్లా కేంద్రంలోని జిల్లా ఆసుపత్రి లో మాత్రమే అందుబాటులో ఉండేది. క్షయ వ్యాధి అనుమానితులను ఆసుపత్రికి పంపించడం, వారికి పరీక్షలు నిర్వహించి వ్యాధిని గుర్తించడం ఇబ్బందిగా ఉండేది. 2025 జనవరి నుంచి నవంబర్‌ వరకు ఈ విధంగానే 1,062 మందిని గుర్తించారు. 2025 డిసెంబర్‌లో హ్యాండ్‌హెల్డ్‌ ఎక్స్‌రే మిషన్‌ అందుబాటులోకి రావడంతో, నేరుగా అనుమానితుల వద్దకే వెళ్లి పరీక్షించారు. హ్యాండ్‌హెల్డ్‌ ఎక్స్‌రే మిషన్‌ ద్వారా గతేడాది డిసెంబర్‌ నుంచి ఆగస్టు వరకు 42,386 మందిని పరీక్షించగా 694 మందిని గుర్తించారు. చికిత్స పొందిన వారిలో కొందరికి వ్యాధి నయం కాగా, ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా చికిత్స పొందుతున్న వారు 571 మంది ఉన్నారు. వీరికి ఆరు నెలల కోర్సుతో చికిత్సను అందిస్తున్నారు.

పౌష్టికాహారం అవసరమే..

రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం ఉండటం, నెలల వ్యవధిలోనే బరువు తగ్గడం వంటివి జరిగినప్పుడు క్షయ (టీబీ)గా గుర్తించి ఎక్స్‌రే మిషన్‌ ద్వారా పరీక్షిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులైన బీపీ, షుగర్‌, క్యాన్సర్‌ వంటివి ఉన్నవారికి క్షయ వ్యాధి త్వరగా సోకుతుండడంతో, వారిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. వ్యాధిని సకాలంలో గుర్తించి, చికిత్సతో పాటు మంచి పౌష్టికాహారం తీసుకుంటేనే త్వరగా బయట పడేందుకు అవకాశం ఉంటుంది. జిల్లాలో 571 మంది వ్యాధిగ్రస్తులు ఉండగా, వీరికి ప్రభుత్వం నెలకు రూ.వెయ్యి చొప్పున ఆరు నెలల పాటు ఇస్తుండగా, పౌష్టికాహారం ఇచ్చేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. జిల్లాలో 80 మందికి పౌష్టికాహార కిట్లను (కేజీ పల్లీలు, అరకిలో చొప్పున పెసరు, శనగ, కంది పప్పు, కిలో నూనె, మూడు కిలోల సన్నబియ్యం) లయన్స్‌ క్లబ్‌ ఇస్తుంది. వాటిని సక్రమంగా తీసుకుని, వైద్యులు సూచించిన మందులను తప్పనిసరిగా వాడితే క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు అవకాశం ఉంటుంది.

జిల్లాలో క్షయ వ్యాధిగ్రస్తుల వివరాలు

2025 జనవరి నుంచి నవంబర్‌ వరకు గుర్తించింది 1,062

హ్యాండ్‌హెల్డ్‌ ఎక్స్‌రే మిషన్‌ ద్వారా గతేడాది

డిసెంబర్‌ నుంచి ఆగస్టు వరకు పరీక్షించింది 42,386

గుర్తించిన వారు 694

ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారు 571

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement