మంచిర్యాలటౌన్: మంచిర్యాలలోని తెలంగాణ డయాగ్నోస్టిక్స్ కేంద్రం(టీ–హబ్)లో పూర్తి స్థాయిలో రక్తపరీక్షలు చేయకపోవడంతో రోగులకు పరీక్షగా మారింది. అవసరమైన వైద్యులు లేక, కొన్ని పరికరాలు పనిచేయక 134 రకాల వైద్య పరీక్షలకు గాను 96 టెస్ట్‌లకే పరిమితమైంది. గత కొన్ని రోజులుగా ఎలిసా మిషన్ పనిచేయక డెంగీ నిర్ధారణ పరీక్షలూ నిలిచిపోయాయి. పాత మిషన్ మరమ్మతులకు ఎక్కువ మొత్తంలో ఖర్చవుతుండడంతో కొత్తది తెప్పించినా ఇంకా పరీక్షలు ప్రారంభించలేదు. బయోకెమిస్ట్రి, రేడియాలజిస్టులు లేక పరీక్షలు చేయడం లేదు. మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో స్కానింగ్ యంత్రం పాడైందని టీ–హబ్‌లోని స్కానింగ్ యంత్రం తీసుకెళ్లారు. దీంతో ఇక్కడ యంత్రం, నిర్ధారణకు వైద్యుడు లేక స్కానింగ్ సేవలు నిలిచిపోయాయి.
నమూనాలన్నీ ఇక్కడికే..
జిల్లాలోని 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 5 ప్రాథమిక అర్బన్ కేంద్రాలు, మూడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఎంసీహెచ్, జీజీహెచ్‌కు వచ్చే రోగుల రక్తనమూనాలు సేకరించి టీ–హబ్‌కు పంపించి పరీక్షలు చేయిస్తారు. ఇందులో ముఖ్యమైన కంప్లీట్ బ్లడ్ పిక్చర్, డెంగీ వంటివి ఉండగా.. కంప్లీట్ బ్లడ్ పిక్చర్‌కు సంబంధించిన టెస్టులు చేస్తున్నారు. లివర్, థైరాయిడ్, బయోకెమిస్ట్రికి సంబంధించిన పరీక్షలు చేయడం లేదు. బయోకెమిస్ట్రిలో రసాయనాల(రియాజెంట్స్) సరఫరాలో ఇబ్బందులతో టెస్టులు చేసేందుకు సమస్యగా మారుతోంది. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొన్నింటిని మాత్రమే టెస్ట్ చేసేందుకు నమూనాలు సేకరించి పంపిస్తుండగా.. టీ–హబ్‌లో పరీక్ష చేస్తున్నారు. కొన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రతీ రోజు టీ–హబ్ వాహనాలు వెళ్లడం లేదని, రెండ్రోజులకోసారి నమూనాలు తీసుకొచ్చి మరుసటి రోజు ఒక్క ట్రిప్ వెళ్లి వస్తుండడంతో రోగ నిర్ధారణ ఆలస్యమవుతోంది. ఆస్పత్రికి వచ్చిన రోగి నుంచి శాంపిళ్లను సేకరించిన వెంటనే అదే రోజు వ్యాధి నిర్ధారణ జరిగితే మరుసటి రోజైనా వైద్యులు మందులు అందించే వీలుంటుంది. టెస్టు ఫలితాల ఆలస్యం వల్ల వ్యాధుల నిర్ధారణలో జాప్యం జరుగుతోంది.
అధునాతన పరికరాలున్నా..
టీ–హబ్‌లో పరీక్షలకు అవసరమయ్యే అన్ని విభాగాలు, రూ.కోట్లతో అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేశారు. 2డీ ఎకో, ఈసీజీ, ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్, మెమోగ్రఫీ, సిటీ స్కాన్ వంటి పరికరాలను ఉన్నాయి. అవసరమైన రేడియాలజిస్టు, బయోకెమిస్ట్రి, కార్డియాలజిస్టు వైద్యులను నియమించలేదు. బయోకెమిస్ట్రి విభాగంలో 56, పాథాలజీ విభాగంలో 37, మైక్రోబయాలజీలో 41 రకాల పరీక్షలు చేయాల్సి ఉంది. ఆయా విభాగాలకు అవసరమైన వైద్యులు, సిబ్బంది లేక పూర్తిస్థాయి పరీక్షలు చేయడం లేదు. వర్షాకాలం కావడం, సీజనల్ వ్యాధులు పెరుగుతుండడంతో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు రోగులు పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ల్యాబ్ టెక్నీషియన్ల కొరతతో టెస్టులు చేసేవారు లేక వ్యాధి నిర్ధారణ ఇబ్బందిగా మారుతోంది. సీజనల్ వ్యాధుల పెరుగుదలతో అవసరమైన రక్త పరీక్షలతోపాటు ఇతర పరీక్షల కోసం ప్రజలు ప్రైవేటు డయాగ్నోస్టిక్ కేంద్రాలకు వెళ్లాల్సి వస్తోంది. టీ హబ్‌లో ఉచితంగా చేసే ఖరీదైన పరీక్షలపై అధికారులు దృష్టి సారిస్తే పేద, మధ్య తరగతి ప్రజలకు ఆర్థిక భారం తప్పుతుంది.


