కదం తొక్కిన ఆదివాసీలు | - | Sakshi
Sakshi News home page

కదం తొక్కిన ఆదివాసీలు

Aug 25 2026 12:21 AM | Updated on Aug 25 2026 12:21 AM

● హక్కుల సాధన కోసం ఐటీడీఏ ముట్టడి ● తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా నుంచి భారీగా తరలివచ్చి.. ● పీవో హామీతో ఆందోళన విరమణ

ఉట్నూర్‌రూరల్‌: రాజ్యాంగబద్ధమైన హక్కుల పరిరక్షణ, ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఆదివాసీలు కదం తొక్కారు. తుడుందెబ్బ పిలుపు మేరకు సోమవారం నిర్వహించిన ‘చలో ఐటీడీఏ’ ముట్టడికి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నలుమూలల నుంచి ఆదివాసీలు భారీగా తరలివచ్చారు. ఉట్నూర్‌లోని గిరిజన భవన్‌లో ప్రత్యేక పూజల అనంతరం అంబేడ్కర్‌ చౌరస్తా, ఎన్టీఆర్‌ చౌరస్తా మీదుగా ఐటీడీఏ కార్యాలయం వరకు సంప్రదాయ డోలు, సన్నాయి వాయిద్యాలతో ర్యాలీగా బయలుదేరారు. ప్రధాన ద్వారం ఎదుట రహదారిపై బైఠాయించారు. దాదాపు రెండు గంటలపాటు ధర్నా చేపట్టారు. ఉదయం నుంచే వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేయడంతో బంద్‌ వాతావరణం కనిపించింది. ఈ సందర్భంగా తుడుందెబ్బ జాతీయ ప్రధాన కార్యదర్శి రమణల లక్ష్మయ్య, రాష్ట్ర అధ్యక్షుడు గోడం గణేశ్‌, ప్రధాన కార్యదర్శి శ్రవణ్‌ కుమార్‌ మాట్లాడారు. 1/70 చట్టాన్ని సవరించాలని సుప్రీంకోర్టులో కేసు వేసిన గిరిజనేతరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే ఆదివాసీల పక్షాన కౌంటర్‌ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయాలన్నారు. జీవో ఎంఎస్‌ 109 ప్రకారం ఏజెన్సీ ప్రాంత పోలీస్‌ ఉద్యోగాల్లో స్థానిక ఆదివాసీలకు 75శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలని, జీవో నంబర్‌ 3 పునరుద్ధరించి, స్థానిక ఆదివాసీల ఉపాధి, ఉద్యోగ హక్కులను కాపాడాలన్నారు. గిరిజనేతరుల భూ దురాక్రమణలు, అక్రమ భూ బదిలీలు అరికట్టాలని, వలస లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే అంశంపై సమగ్ర విచారణకు ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు చేయాలన్నారు. ఆదివాసీ నిరుద్యోగ యువత కోసం ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలని, ఐటీడీఏ పరిధిలో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని 120 రాయ్‌ సెంటర్లకు పక్కా భవనాలు నిర్మిస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలన్నారు. ‘కోర్‌ ఏరియా’, ’బఫర్‌ ఏరియా’, ’టైగర్‌ జోన్‌’ పేర్లతో ఆదివాసీలపై అటవీ అధికారుల దాడులు నిలిపివేయాలని కోరారు. డిమాండ్లను నెరవేర్చకపోతే ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. తుడుందెబ్బ, ఆదివాసీ సంఘాల రాష్ట్ర, జిల్లా నాయకులు నగేష్‌, సిడాం జంగుదేవ్‌, పెందుర్‌ పుష్పారాణి, సత్యం, ఇందిరా, నారాయణ, రాజన్న, మడావి వెంకటేశ్‌, సోయం చిన్నయ్య, అర్క శేషరావు, కొడప నగేశ్‌, మనోజ్‌ ఆదివాసీలు తదితరులు పాల్గొన్నారు. కాగా, సమస్యల పరిష్కారానికి ఐటీడీఏ పీవో మంద మకరందు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

పోలీసుల బందోబస్తు..

అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆదిలాబాద్‌ ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ ఆధ్వర్యంలో అడ్మిన్‌ ఏఎస్పీ మౌనిక, ఉట్నూరు, ఆదిలాబాద్‌ ఏఎస్పీలు రుత్విక్‌ సాయి కొట్టే, సురేందర్‌, ఆదిలాబాద్‌ డీఎస్పీ జీవన్‌రెడ్డి పర్యవేక్షణలో సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదివాసీల భారీ ర్యాలీ, ధర్నా కారణంగా ఉట్నూర్‌ ఎక్స్‌రోడ్డు, చెక్‌పోస్ట్‌ కొత్తగూడ పరిసర ప్రాంతాల్లో దాదాపు రెండు గంటలపాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement